BJP: తెలంగాణలో బీజేపీ దూసుకొస్తోంది. ఆ ఫస్ట్రేషన్ టీఆర్ఎస్ లో కనిపిస్తోంది. మొన్న బండి సంజయ్ అరెస్ట్.. నిన్న నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై దాడి నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులు తట్టుకోలేకపోతున్నారని అర్థమవుతోంది. ప్రజలకు చేరువ కావాలంటే ప్రతిపక్షాలపై దాడులు చేయడం కాదు.. వారిని మెప్పించి ఒప్పించాలి. అది చేయకుండా గులాబీ దండు ఇలా అడ్డంగా నిలబడుతున్న బీజేపీపై కయ్యానికి కాలుదువ్వుతోంది. సహజంగానే ఇది సానుభూతిగా మరలి బీజేపీకి ఫేవర్ అవుతోంది. ఈ చిన్న లాజిక్ ను టీఆర్ఎస్ ఎందుకు మిస్ అవుతుందో అర్థం కావడం లేదు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడు మామూలుగా లేదు. కేసీఆర్ సర్కార్ తో ఢీ అంటే ఢీ అనడంలో బండి సంజయ్ కంటే తోపు ఎవరూ తెలంగాణలో లేరనుకోవాలేమో.. అంతలా చెలరేగిపోతున్నాడు.. ఆయన పేల్చే డైలాగులు తొందరగా జనంలోకి వెళుతాయి. మీడియాను,ప్రజలను ఆకట్టుకుంటాయి. తాజాగా తెలంగాణలో టీఆర్ఎస్ కు ఈ ఒక్క సంవత్సరమే ఉందని.. తర్వాత ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వమే వస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి అధికారం ఇవ్వడానికి ప్రజలు డిసైడ్ అయ్యారని .. టీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు మానసిక ఒత్తిడితోనే మా ఎంపీ ధర్మపురి అరవింద్ పై దాడి చేశారని విమర్శించారు.
మా ఎంపీ అరవింద్ పై దాడి చేస్తారని డీజీపీకి, సీపీకి ముందే తెలుసు అని బండి సంజయ్ బాంబు పేల్చారు. సీఎం కార్యాలయంలో దర్శకత్వంలో నిజామాబాద్ సీపీ నేతృత్వంలోనే పోలీసు అధికారులు దాడి చేశారని ఆరోపించారు. ఎంపీపై దాడి చేస్తే ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు చేయరా? అని నిలదీశారు. బీజేపీ కార్యకర్తలపై కత్తులతో దాడి చేశారని.. హత్యాయత్నం చేసిన వారు బహిరంగంగా తిరుగుతున్నారని ఆరోపించారు. మాపైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
టీఆర్ఎస్ వాళ్లే బీజేపీ నేతలపై దాడులు చేస్తున్నారు. ఆ వీడియోలను తీసి బలమైన బీజేపీ దండు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ప్రజలకు చేరువ చేస్తోంది. దీంతో టీఆర్ఎస్ పై సహజంగానే ప్రజల్లో కోపం వస్తోంది. బీజేపీపై సానుభూతి వస్తోంది. కేంద్రంలోని బీజేపీ ఏం చేయకున్నా.. టీఆర్ఎస్ పథకాలతో దగ్గరైనా కూడా రెండు సార్లు గెలిచిన వ్యతిరేకత టీఆర్ఎస్ పై ఉంది. దీన్ని అధిగమించాలంటే బీజేపీని పట్టించుకోవడం కాదు.. ప్రజలను పట్టించుకోవాలని.. వారి కోరికలు తీర్చాలని మేధావులు హితవు పలుకుతున్నారు.