BJP Politics : క్రమశిక్షణకు మారుపేరు అయిన భారతీయ జనతాపార్టీలో కొన్ని రోజులుగా అంతర్యగతంగా ఉన్న ఆధిపత్య పోరు తాజాగా మీడియాకెక్కింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆసరాగా చేసుకుని ఆయన వ్యతిరేకులు బహిరంగంగా వ్యాఖ్యలు చేయడంతో రచ్చ మొదలైంది. వెంటనే బండి సంజయ్ అనుకూల నేతలు కూడా రంగంలోకి దిగారు. అధ్యక్షుడి వ్యాఖ్యలపై మీడియాకు ఎక్కడాన్ని తప్పు పడుతున్నారు. ప్రస్తుతం ఇదే తెలంగాణ బీజేపీలో హాట్ టాపిక్‌గా మారింది.
కవితపై వ్యాఖ్యల దుమారం..
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన క్రమంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నేతలు తీవ్రస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. బండి సంజయ్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పకపోతే బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అంతకుముందు బండి సంజయ్ దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తూ ఆందోళన చేపట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్‌పై బీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదుతో.. పోలీసు కేసులు నమోదయ్యాయి. కవితపై చేసిన వ్యాఖ్యలకు గానూ బండి సంజయ్‌కు రాష్ట్ర మహిళా కమిషన్ కూడా నోటీసులు జారీ చేసింది. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి కమిషన్ సుమోటోగా స్వీకరించింది. మార్చి 15న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
అరవింద్ సంచలన వ్యాఖ్యలు
ఒకవైపు బీఆర్‌ఎస్ ఆందోళనలు కొనసాగుతుండగానే బండి సంజయ్ వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం, బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మాట్లాడడం కొత్త చర్చకు దారితీసింది. ఢిల్లీలో ఆదివారం మీడియాతో మాట్లాడిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్.. బండి సంజయ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను తాను సమర్థించనని.. ఆయన ఆ మాటలను వెనక్కి తీసుకుంటే బాగుంటుందని అన్నారు. అంతేగాక, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదన్నారు. సామెతలను జాగ్రత్తగా ఉపయోగించాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అంటే హోదా అని.. పవర్ సెంటర్ కాదని ఘాటుగా స్పందించారు.
అర్వింద్ తీరుపై అసంతృప్తి..
మరోవైపు బండి సంజయ్ అనుకూల నేతలు కూడా మీడియా ముందుకు వచ్చారు. బండిపై అరవింద్ వ్యాఖ్యలు సరికాదంటూ రాజా సింగ్ హితవు పలికారు. అర్వింగ్ వ్యాఖ్యలను ఖండించారు. సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం కాదన్నారు. బండి సంజయ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడని.. ఏది మాట్లాడాలి.. ఏది మాట్లాడకూడదనే అవగాహన అతనికి ఉందన్నారు. ఎంపీ అరవింద్ ఆలోచించి మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. పార్టీలో ఏమైనా ఇబ్బంది ఉంటే నేరుగా అధ్యక్షుడితో మాట్లాడి ఉండాల్సిందని, మీడియా ముందుకు రావడం ఏంటని ప్రశ్నించారు. అరవింద్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ సీనియర్ నేత విజయశాంతి కూడా బండి సంజయ్‌పై అరవింద్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఏదైనా ఉంటే పార్టీ అంతర్గత సమావేశంలో మాట్లాడాలని.. ఇలా బహిరంగంగా స్పందించడం సరికాదన్నారు.
మొత్తంగా బీజేపీలో వర్గాలు ఏర్పడుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణలో పార్టీ అనుకూల పవనాలు వీస్తున్నవేళ అంతర్గత సమస్యలు రచ్చకెక్కితే ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం అటు పార్టీలో, ఇటు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.