YCP Attacks : పుట్టపర్తిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఎదుటే ఎమ్మెల్యే డ్రైవర్ పై వైసీపీ నేతల అరాచకం

రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి అనడానికి ఇదో చక్కటి ఉదాహరణ. సాక్షాత్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఎదుటే వైసీపీ నేతలు దాడికి పాల్పడుతున్న

Written By: NARESH, Updated On : October 14, 2023 12:47 pm
Follow us on

YCP Attacks : సత్యసాయిధామం పుట్టపర్తిలో వైసీపీ శ్రేణులు హల్చల్ సృష్టించాయి. ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే ప్రశాంతి నిలయంలో వైసీపీ నేతలు విధ్వంసకాండకు దిగారు. నడిరోడ్డు పైనే ఓ వ్యక్తిని దారుణంగా కొట్టారు. దీంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో టిడిపి, వైసీపీల మధ్య నివురు గప్పిన నిప్పులా వివాదాలు నెలకొన్నాయి. తాజాగా సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో ఇవి మరింత ముదిరాయి. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కారు డ్రైవర్ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని తిట్టాడంటూ వైసీపీ నేతలు వీర విహారం చేశారు. నడి రోడ్డుపైనే సదరు డ్రైవర్ పై విరుచుకుపడ్డారు. స్థానికంగా ఇది సంచలనం సృష్టించింది.

పుట్టపర్తి లో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో.. సీఎం పర్యటనల ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్థల పరిశీలన చేస్తున్నారు.అదే సమయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కారు డ్రైవర్ సురేష్ ని కొందరు వైసీపీ నేతలు స్కార్పియో లో తెచ్చి మైదానం వద్ద విడిచిపెట్టారు. ఆ సమయంలో సురేష్ కి గాయాలై ఉన్నాయి. సురేష్ స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా పుట్టపర్తి పట్టణ ఎస్సై వీరేష్ ఆయనను బలవంతంగా జీపులో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. దీంతో బాధితుడు సురేష్ కన్నీరు మున్నీరయ్యాడు.

అంతకుముందే స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని సురేష్ తిట్టాడంటూ.. పదిమంది ఎమ్మెల్యే అనుచరులు సురేష్ ను చుట్టుముట్టారు. రోడ్డుపైనే రాడ్లు, కర్రలతో దారుణంగా కొట్టారు. వైసిపి కార్యాలయం వరకు ఈడ్చుకొని వెళ్లి మరి దాడి చేశారు. సురేష్ వద్దని కోరినా కనికరించలేదు. ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు. ఈ ఘటనను చూసిన స్థానికులు షాక్ కు గురయ్యారు. అయినా సరే వారి కోపం తగ్గలేదు. పార్టీ కార్యాలయం నుంచి కారులో సురేష్ ను మైదానం వద్దకు తీసుకెళ్లిపోయారు. అప్పటికే అక్కడ కలెక్టర్, ఎస్పీ తో పాటు ఎమ్మెల్యే ఉన్నారు. వారి ముందే మరోసారి దాడి చేశారు. పోలీసులు సైతం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. చివరకు బాధితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరీ ఇంత అమానుషమా అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి అనడానికి ఇదో చక్కటి ఉదాహరణ. సాక్షాత్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఎదుటే వైసీపీ నేతలు దాడికి పాల్పడుతున్న నియంత్రించలేని స్థితిలో ఉండడం విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అటు పోలీసుల తీరుపై ఆరోపణలు వస్తున్నాయి. గత కొద్దిరోజులుగా పుట్టపర్తి నియోజకవర్గంలో అధికార, విపక్షాల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాక్షాత్ కలెక్టర్, ఎస్పీ సమక్షంలో దాడులు జరుగుతున్నాయి అంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అని టిడిపి కీలక నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.