Ashok Chavan: మోడీని గద్దె దించి.. ప్రతిపక్షాలను ఏకం చేసి.. 2024లో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ఇండియా పేరుతో కూటమి ఏర్పాటు చేస్తే.. అందులో రోజుకో లుకలుక బయటపడుతోంది. ఒక్కో పార్టీ ఒక్కో కారణం చెప్పి అందులో నుంచి వెళ్ళిపోతోంది. చివరికి ఎన్నికల నాటికి ఆ కూటమిలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే మిగిలేటట్టుంది. ఇటీవల ఇండియా కుటమి నుంచి నితీష్ కుమార్ బయటికి వెళ్లిపోయారు. భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి బీహార్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఉత్తరప్రదేశ్ లోని రాష్ట్రీయ లోక్ దళ్ ఇండియా కూటమికి టాటా చెప్పింది. బిజెపితో జట్టు కట్టింది. అది కూడా దాదాపుగా ఎన్డీఏ కూటమిలో చేరినట్టే. ఇక అరవింద్ పంజాబ్లో ఒంటరిగా పోటీ చేస్తామని సంకేతాలు ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ లోనూ తాము ఒంటరిగా పోటీ చేస్తామని తృణ మూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఇక ఆ కూటమిలో కాంగ్రెస్ మినహా పేరు మోసిన పెద్ద పార్టీలు లేవు. ఒకవేళ ఉన్నప్పటికీ జనాలను ప్రభావితం చేసే నాయకులు అందులో ఉన్నట్టు కనిపించడం లేదు. ఇది ఇలా ఉండగానే కాంగ్రెస్ పార్టీ ఇండియా కుటుంబం కి మరో ఎదురు దెబ్బ తగిలింది.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ మంగళవారం బిజెపిలో చేరారు. సోమవారం ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మహారాష్ట్రలో సీట్ల కేటాయింపు సంబంధించి శరత్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే ఎటువంటి హామీ ఇవ్వకపోవడంతో ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక అశోక్ చవాన్ రాజీనామా తర్వాత కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొంది.. ఆయన భారీ ర్యాలీగా వెళ్లి బిజెపిలో చేరారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అశోక్ కు బిజెపి రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు అశోక్ రాజీనామాతో మహారాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి రమేష్ చెన్నితల అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేశారు. అశోక్ తన రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆయనను ముఖ్యమంత్రిని చేసిందని.. ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఆయన పార్టీని వదిలి వెళ్లారని అన్నారు. అశోక్ లాంటి నాయకులు వెళ్ళినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఏమీ కాదని.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపిస్తామని ఆయన అన్నారు.
అశోక్ రాజీనామా నేపథ్యంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆయనను అనుసరించే అవకాశం ఉందని అక్కడి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో అశోక్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకునే విధంగా కృషి చేశారు. అంతేకాదు శివసేన తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. కానీ ఆ సంకీర్ణ ప్రభుత్వం ఆదిలోనే కుప్పకూలిపోయింది. పైగా శివసేనలో ఏక్ నాథ్ షిండే వర్గం బిజెపికి మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పట్లో ఈ వ్యవహారంపై అశోక్ చవాన్ శివసేన నాయకులపై ఫిర్యాదు చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోలేదు. దీంతో అప్పటినుంచే ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పై ఆగ్రహం గా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా పార్టీ నుంచే బయటికి వచ్చారు. ఎన్నికల నాటికి మరింత మంది నాయకులు బిజెపిలో చేరే అవకాశం ఉందని అక్కడి మీడియా చెబుతోంది.