Asaduddin Owaisi: లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం(జూన్ 25న) లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. 18వ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసద్.. యుద్ధంతో అతలాకుతలం అవుతున్న పశ్చిమాసియా దేశం పాలస్తీనాను ప్రశంసించారు. జై పాలస్తీనా అని నినదించారు. దీనిపై బీజేపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ప్రొటెం స్పీకర్ అసద్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
సమర్థించుకున్న ఒవైసీ..
ఇదిలా ఉండగా సభ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంపీ అసదుద్దీన్ సభలో తాను చేసిన నినాదాన్ని సమర్థించుకున్నారు. ‘జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా’ అనడంలో తప్పు లేదని పేర్కొన్నారు. ’ఇతర సభ్యులు కూడా రకరకాలుగా నినాదాలు చేశారు. అవి తప్పు కానప్పుడు తాను చేసిన నినాదం ఎలా తప్పో చెప్పాలన్నారు. పాలస్తీనా గురించి ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నించగా.. ‘వాళ్లు అణగారిన ప్రజలు’ అని అన్నారు. మరోవైపు పాలస్తీనా ప్రస్తావనపై కొంతమంది సభ్యుల నుంచి ఫిర్యాదులు అందాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. దీంతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారని వెల్లడించారు.
ఏ దేశంతో శత్రుత్వం లేదు..
భారత్‌కు పాలస్తీనాతోపాటు మరే దేశంతో శత్రుత్వం లేదని కిరణ్ రిజిజు తెలిపారు. అయితే ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు, మరొక దేశాన్ని ప్రశంసిస్తూ నినాదాలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం కూడా ఒవైసీ వ్యాఖ్యలు తప్పని తెలిపారు. పార్లమెంట్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. భారత్‌లో నివసిస్తూ భారత్ మాతాకీ జై అనలేదు కానీ జై పాలస్తీనా అనడం రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పారు. దీనిని ప్రజలు అర్థం చేసుకోవాలని బీజేపీ నేత అమిత్ మాల్వియా సూచించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఒవైసీసి అనర్హుడిగా ప్రకటించాలని కోరారు.