Telangana Elections 2023: మారని గ్రేటర్‌ ఓటరు తీరు.. ఎప్పటిలాగే ఓటింగ్‌పై నిరాసక్తత!

ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నమోదైన పోలింగ్‌ చాలా తక్కువగా ఉంది. ఐటీ ప్రొఫెషనర్లు రాత్రి విధులు నిర్వహించి ఉన్నందున మధ్యాహ్నం 2 తర్వాత పోలింగ్‌ కేంద్రాలకు వస్తారని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది.

Written By: Raj Shekar, Updated On : November 30, 2023 4:02 pm

Telangana Elections 2023

Follow us on

Telangana Elections 2023: తెలంగాణ వ్యాప్తంగా గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ శరవేగంగా సాగుతుండగా, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఓటర్లు నిరాసక్తతతో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని శేలింగంపల్లి, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్‌ వంటి శివార్లలో మినహా మిగతా నియోజకవర్గాల ప్రజలు ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. పోలింగ్‌ ప్రారంభమైన మొదటి నాలుగు గంటల్లో కేవలం 16–17 శాతం మంది కూడా ఓటు వేయలేదు.

ఐటీ ఉద్యోగులు దూరం..
ముఖ్యంగా హై ప్రొఫైల్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కారిడార్‌లో ఓటర్లు తమ ఓటు వేసేందుకు ఏమాత్రం ఉత్సాహం చూపడం లేదు. అర్థరాత్రి వరకు పనిచేసిన చాలా మంది టెక్కీలు తెల్లవారుజామునే లేవడానికి ఇష్టపడక ఎన్నికల సంఘం ప్రకటించిన సెలవుల్లో ఎక్కువ భాగం గడిపారు. బీఆర్‌ఎస్‌ ఈసారి గ్రేటర్‌ పరిధిలోని ఐటీ ఓటర్లపై భారీగా ఆశలు పెట్టుకుంది. ఐటీ కారిడార్‌ అభివృద్ధికి కృషి చేసిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీ.రామారావు టెకీల నుంచి బీఆర్‌ఎస్‌కు భారీగా మద్దతు ఉంటుందని భావించారు. ఇందుకోసం ఐటీ ఉద్యోగులతో వరుస సమావేశాలు నిర్వహించి, వారికి వర్క్‌షాప్‌లు నిర్వహించి, పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తే వారి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కానీ, ఓటింగ్‌ విషయానికి వస్తే చాలా మంది టెక్కీలు ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో అలసత్వం వహించడం వల్ల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు భారీ నష్టం వాటిల్లుతుందని విశ్లేషకులు అంటున్నారు.

మధ్యాహ్నంపై ఆశలు..
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నమోదైన పోలింగ్‌ చాలా తక్కువగా ఉంది. ఐటీ ప్రొఫెషనర్లు రాత్రి విధులు నిర్వహించి ఉన్నందున మధ్యాహ్నం 2 తర్వాత పోలింగ్‌ కేంద్రాలకు వస్తారని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా, కేవలం 50 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది. రాష్ట్రమంతటా 80 శాతం పోలింగ్‌ నమోదైంది.

ఐటీ కారిడార్‌లో 15 స్థానాలు..
జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ సీట్లు ఉండగా, కోర్‌ సిటీ హైదరాబాద్‌లో 15 సీట్లు ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీకైనా ఈ సీట్లు కీలకం. జీహెచ్‌ఎంసీ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం పుంజుకుంటున్నా కోర్‌ సిటీలో మాత్రం పోలింగ్‌ కేంద్రాల వద్ద అంతగా రద్దీ కనిపించడం లేదు. ఇది అన్ని రాజకీయ పార్టీలను, ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ను టెన్షన్‌ పెడుతోంది.