
ఏపీ రాజకీయాల్లో.. ఏపీ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ముందే అంచనావేసి చెప్పడంలో మీడియా విస్తృతంగా పనిచేస్తోంది. నిన్న పేరు లీక్ అయ్యిందో లేదో ఈరోజు అదేపేరును మండలి చైర్మన్ గా జగన్ ప్రకటించడం విశేషం అనే చెప్పాలి.
తాజాగా ఏపీ శాసన మండలి చైర్మన్ రేసులో ఎవరున్నారన్నది మీడియా ముందుగానే బ్రేక్ చేసింది. సీఎం జగన్ ‘ఇక్బాల్’ ను అనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఏపీ కొత్త రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గా హిందూపురంకు చెందిన మైనార్టీ నేత, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ వైపు సీఎం జగన్ మొగ్గు చూపుతున్నట్టు ముందే విశ్వసనీయంగా తేలింది.
ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న సమయంలోనే నాటి మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు భద్రతా అధికారిగా ఇక్బాల్ పనిచేశారు. 2019లో ఇక్బాల్ కు అధికార వైసీపీ హిందూపురం సీటు ఇచ్చి బాలక్రిష్ణపై పోటీకి నిలబెట్టింది. అయితే ఆ ఎన్నికల్లో సినీ నటుడు బాలయ్య చేతిలో ఇక్బాల్ ఓడిపోయారు.
అయితే ఓడినా కూడా సీఎం జగన్ ఇక్బాల్ ను అక్కున చేర్చుకున్నాడు. వెంటనే ఎమ్మెల్సీ సీటు ఇచ్చి సముచిత గౌరవం ఇచ్చాడు. మళ్లీ ఎమ్మెల్సీగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక్బాల్ పదవీకాలం 2027 మార్చి 29వరకు ఉంది. దీంతో ఆయననే మండలి చైర్మన్ గా నియమించాలని జగన్ డిసైడ్ అయ్యారు.
ప్రస్తుత చైర్మన్ షరీఫ్ కూడా ముస్లిం సామాజికవర్గమే. అదే సామాజికవర్గానికి చెందిన నేతను జగన్ ఎంచుకోవడం.. మండలి చైర్మన్ చేయడం నిజంగా విశేషం అనే చెప్పాలి.