Arrested Ministers Disqualification: కేంద్ర ప్రభుత్వం ( central government) మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఐదు సంవత్సరాలు, అంతకుమించి శిక్ష పడే అవకాశం ఉన్న తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో అరెస్టు అయి.. 30 రోజులు జైల్లో ఉండే మంత్రులను.. 31వ రోజు పదవి నుంచి తొలగించే కీలక బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం బుధవారం లోక్ సభలో ప్రవేశపెట్టనుంది. కేంద్రంలో ప్రధానమంత్రి తో సహా మంత్రులు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహా మంత్రులంతా ఈ బిల్లు పరిధిలోకి వస్తారు. అయితే ఇప్పటివరకు నేరారోపణలతో అరెస్టు అయిన మంత్రులు రాజీనామా చేయాలని ఏ చట్టంలోనూ, రాజ్యాంగ నిబంధనలోనూ లేదు. రాజీనామా చేయడం సంప్రదాయంగా వస్తోంది. కానీ అరెస్టు అయిన వారు రాజీనామా చేయడం ఇటీవల లేదు. మొన్నటికి మొన్న అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయ్యారు. రాజీనామా చేసే సంప్రదాయాన్ని ఉల్లంఘించారు. జైలు నుంచే ప్రభుత్వ పాలన చేసేందుకు ప్రయత్నించారు. దీనిని తప్పు పట్టింది సుప్రీంకోర్టు. తమిళనాడులో అరెస్ట్ అయిన మంత్రి సెంథీల్ బాలాజీ విషయంలో కూడా ఇలానే జరిగింది. అయితే మరోసారి ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ బిల్లును తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఏపీలో బీజేపీ లెక్క అదే.. అమిత్ షా తేల్చేశారుగా
ఏకంగా మూడు బిల్లులు..
అయితే ప్రజాప్రతినిధుల అరెస్టుల విషయంలో, వారి పదవుల తొలగింపు విషయంలో ఈ సవరణ బిల్లులను తెరపైకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం మూడు బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. 130 వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లు, జమ్మూ కాశ్మీర్( Jammu Kashmir) పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు. ఈ మూడు బిల్లులు అరెస్ట్ అయిన మంత్రులను తొలగించేందుకు ఉద్దేశించినవి. మొదటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినవి కాగా.. రెండోది కేంద్ర పాలిత ప్రాంతాలది.. మూడోది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి సంబంధించినది. ఈ మూడు బిల్లులను కేంద్ర హోమ్ శాఖ మంత్రి ఈరోజు లోక్ సభలో ప్రవేశపెడతారు. వీటిని పార్లమెంట్ సంయుక్త కమిటీ పరిశీలనకు పంపాలని కూడా ఒక తీర్మానాన్ని పెట్టే అవకాశం ఉంది.
31 వ రోజు పదవి తొలగింపు..
ఈ బిల్లులు ఆమోదం పొందితే 30 రోజులపాటు జైల్లో ఉన్న మంత్రి రాజీనామా చేయకపోతే.. 31వ రోజు అతని పదవి రద్దు అవుతుంది. అయితే ఆ నేరం ఐదు సంవత్సరాలు, అంతకుమించి శిక్ష పడే అర్హత ఉన్న నేరమై ఉండాలి. ఏకంగా ఈ చట్టం పరిధిలోకి ప్రధానమంత్రి పదవిని కూడా తేవడం చర్చకు దారితీస్తోంది. అయితే ఇది ఒక విధంగా సాహసోపేతమైన నిర్ణయం. సాధారణంగా అన్ని రాష్ట్రాల్లో చాలామంది నేతలపై ఆరోపణలు ఉన్నాయి. కేసులు నడుస్తున్నాయి. పైగా ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందన్న అనుమానాలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ఈ చట్ట సవరణలు చేయడం కూడా ఆందోళనలు కలిగిస్తోంది.
Also Read: రామ్ చరణ్ ని అభినందించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్..
అయితే ఈ సవరణ బిల్లులను కాంగ్రెస్ పార్టీ( Congress Party ) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది ముమ్మాటికి విపక్షాలను బలహీనం చేసే కుట్రగా అనుమానిస్తోంది. ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా తప్పుడు కేసులు పెడుతున్న వైనాన్ని గుర్తుచేస్తోంది. ఇప్పుడు కచ్చితంగా విపత్తు ముఖ్యమంత్రులను టార్గెట్ చేసి జైలు పాలు చేసే కుట్రగా అభివర్ణిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించలేని పరిస్థితుల్లో విపక్ష ముఖ్యమంత్రులను తొలగించడం ద్వారా.. అక్కడ అధికారాన్ని చేజిక్కించుకునే కుట్ర చేయడమే.. ఈ సవరణ బిల్లుల ముఖ్య ఉద్దేశ్యం అని అభిప్రాయపడుతోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ ఓట్ల చోరీపై అధికార యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేంద్రం ఈ బిల్లులను తెస్తోందన్న అనుమానాలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. అందుకే ఆ పార్టీ ఈ సవరణ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.