
Delhi Liquor Scam: ఏపీలో అధికార వైసీపీకి మరో కుదుపు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.ఈ స్కాం బయటకు వచ్చిన వెంటనే ఎంపీ మాగుంట కుటుంబంపై ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా బాలాజీ గ్రూప్ యజమానిగా ఉన్న రాఘవకు ప్రత్యక్ష ప్రమేయముందని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఈడీ పలుమార్లు రాఘవను ప్రశ్నించింది. అయితే ఈ లిక్కర్ స్కాంతో తమకు ఎటువంటి సంబంధాలు లేవని ఎంపీ శ్రీనివాసులరెడ్డి చెబుతూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన వారసుడిగా రాఘవను పోటీచేయించాలని భావిస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే రాఘవను ఈడీ అరెస్ట్ చేయడం, ఆరోపణలు ఎదుర్కోవడం విశేషం.
లిక్కార్ స్కామ్ కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.గత రెండు రోజులుగా రాఘవను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఆయన సహకరించకపోడంతో అరెస్ట్ కు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం కోర్టులో హాజరుపరచనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో ఈడీ పట్టుబిగుస్తోంది. గత కొలంగా ఈడీ, సీబీఐ అధికారులు సంయుక్తంగా ఢిల్లీతో పాటు చెన్నై, నెల్లూరులో సోదాలు చేస్తున్నారు. ప్రధానంగా అభియోగాలు ఎదుర్కొంటున్న సౌత్ గ్రూప్ నుంచి నలుగుర్ని అరెస్ట్ చేశారు. శరత్ చంద్రా రెడ్డి, అభిషేక్, తో పాటుగా మాగుంట రాఘవరెడ్డి కి ప్రమేయం ఉందని ఈడీ పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ తయారు సమయంలోనే పక్కా ప్రణాళికతోనే లిక్కర్ వ్యాపారులకు లబ్ది చేకూరేలా లావా దేవీలు నిర్వహించారనేది ఈడీ ఆరోపిస్తోంది. అందులో భాగంగా సౌత్ గ్రూపు నుంచి జరిగిన లావాదేవీల్లో రాఘవ రెడ్డి ప్రమేయ ఉందనేది ఈడీ వాదన.
ఢిల్లీలో పొందిన లిక్కర్ దుకాణాల్లో రాఘవ భారీగా లబ్ధి పొందారనేది ప్రధాన ఆరోపణ. అయితే ఈ స్కాం బయటకు వచ్చిన నాటి నుంచే ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుటుంబం చుట్టూ ఆరోపణలు వచ్చాయి. దానిని ఎప్పటికప్పుడు ఎంపీ ఖండిస్తూ వచ్చారు. తమ కుటుంబం ఎప్పటి నుంచో లిక్కర్ వ్యాపారం చేస్తూ వస్తోందని.. నిబంధనలకు లోబడి చేస్తున్నామని కూడా చాలా సందర్భాల్లో ప్రకటించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మాగుంట ఆగ్రో ఫార్మ్స్ సంస్థతో తమకు ఎటువంటి సంబంధాలు లేవని కూడా చెప్పారు. ఇది ఉత్తరాధి రాష్ట్రాల కుట్రగా అభివర్ణించారు. కొద్దిరోజుల కిందట మాగుంట ఈ కీలక ఆరోపణలు చేశారు. 70 సంవత్సరాలుగా లిక్కర్ వ్యాపారం చేస్తున్నామని.. ఎనిమిది రాష్ట్రాల్లో వ్యాపారాలు జరుగుతున్నాయని.. ఢిల్లీ లిక్కర్ స్కాంతో అసలు మాకు సంబంధమే లేదన్నారు. ఢిల్లీలోని 32 జోన్లలో మద్యం టెండర్లు నిర్వహిస్తే.. మాగుంట ఆగ్రో ఫార్మ్స్ రెండు జోన్లు దక్కించుకుందని.. కానీ ఆ సంస్థతో తమ కుటుంబానికి ఎటువంటి సంబంధాలు లేవని ఎంపీ శ్రీనివాసులరెడ్డి చెబుతున్నారు.

తాజాగా రాఘవ అరెస్ట్ తో వైసీపీ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటికే ఈ స్కాంలో విజయసాయిరెడ్డి సమీప బంధువు శరత్ చంద్రారెడ్డి అరెస్టయ్యారు. ఇప్పుడు ఏకంగా ఓ ఎంపీ కుటుంబానికే సంబంధాలున్నాయని తేలడంతో విపక్షాలకు ప్రచారాస్త్రంగా మారనుంది. ఒక వైపు ఎమ్మెల్యేల ధిక్కార స్వరాలు, మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు ఏపీకి తాకుతుండడంతో ప్రభుత్వ పెద్దలు కలరవపాటుకు గురవుతున్నారు. ఏంచేయాలో వారికి పాలుపోవడం లేదు.