Homeఆంధ్రప్రదేశ్‌Arogyasree ఆరోగ్యశ్రీ అంతేనా... పథకం అమలులో కీలక మార్పులు

Arogyasree ఆరోగ్యశ్రీ అంతేనా… పథకం అమలులో కీలక మార్పులు

Arogyasree: ‘నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు’ అన్న చందంగా ఉంది ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు. మీరేమనుకుంటే అనుకోండి.. నేను అనుకున్నది చేస్తాను అన్నట్టుంది సీఎం జగన్ వ్యవహార శైలి. నిశ్చింతగా నడుస్తున్న ‘ఆరోగ్యశ్రీ’ పథకంపై ప్రభుత్వం మరో కొత్త ప్రయోగం సన్నద్ధమయ్యారు. ఇప్పటికే అంతంత మాత్రంగా అమలవుతున్న ఈ పథకాన్ని పూర్తిగా రద్దు పద్దులోకి చేర్చే వింత నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేసిన ఆస్పత్రికి కాకుండా, చికిత్స చేయించుకున్న రోగి ఖాతాలో డబ్బులు వేస్తారట. ఆ డబ్బులను రోగి ఖాతా నుంచి ఆస్పత్రి యాజమాన్యం తీసుకోవాలట. ఇది సోమవారం అధికారులకు ముఖ్యమంత్రి జారీ చేసిన ఆదేశం. ఇదేమి వింత ప్రయోగమంటూ ఆరోగ్యరంగ నిపుణులు, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. ప్రజల ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నాం అని గొప్పగా చెప్పుకొనేందుకు ఏకంగా ప్రజారోగ్యంతోనే ఆటలాడుతున్నారని మండిపడుతున్నారు.

Arogyasree
Arogyasree

దశాబ్దాలుగా మార్పు లేదు.

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పథకాన్ని ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ బిల్లుల ప్రాసెసింగ్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. రోగి నేరుగా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రికి వెళ్లడం… అక్కడ ఆరోగ్యశ్రీ కార్డు చూపించడం… దాని ఆధారంగా ఆస్పత్రి యాజమాన్యం రోగికి చికిత్స చేయడం జరుగుతోంది. రోగికి అందించిన చికిత్సతోపాటు బిల్లులను డిశ్చార్జి అయిన 15 రోజుల్లో ఆస్పత్రి యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ ట్రస్టుకు పంపిస్తాయి. ఆ తర్వాత నెలకో, రెండు నెలలకో ఆ బిల్లు మొత్తాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్టు నేరుగా ఆస్పత్రికి చెల్లిస్తుంది. ఇదీ ఇప్పటిదాకా అమలవుతున్న విధానం.దీనివల్ల అటు రోగికి, ఇటు ఆస్పత్రికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ… మొట్టమొదటిసారి ఈ పద్ధతిలో జగన్‌ సర్కారు మార్పులు చేస్తోంది. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీ బిల్లుల డబ్బులను చికిత్స చేసిన ఆస్పత్రులకు కాకుండా, రోగుల ఖాతాలో వేస్తామని తెలిపారు. ఆ డబ్బులు రోగి ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా (ఆటో డెబిట్‌) ఆస్పత్రికి వెళ్లిపోతాయట. తద్వారా పథకం అమలులో ‘పారదర్శకత’ ఉంటుందని జగన్‌ ప్రకటించారు. చూడటానికీ, వినడానికీ ఇది బాగానే ఉంది. క్షేత్రస్థాయిలో ఆరోగ్యశ్రీ పథకం అమలుపై ఇది తీవ్ర ప్రభావం చూపడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బిల్లులు పెండింగ్

జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘ఆరోగ్యశ్రీ’ పథకానికి గ్రహణం పట్టింది. కాలానుగుణంగా ప్యాకేజీ ధరలు (చికిత్సకు నిర్ణయించిన మొత్తం) పెంచలేదు. పైగా… బిల్లులను భారీగా పెండింగ్‌లో పెట్టేశారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి ఆస్పత్రులకు రూ.500 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో… నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ‘ఆరోగ్యశ్రీ’ అంటేనే బెంబేలెత్తిపోతున్నాయి. ఆరోగ్యశ్రీలో శస్త్ర చికిత్సలు చేయడానికి వెనుకడుగు వేస్తున్నాయి. మరోవైపు చాలా ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ నుంచి బయటికి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఎప్పుడో ఒకసారి… ఆలస్యంగానైనా బిల్లులు వస్తాయనే నమ్మకం ఉంటేనే ఇదీ పరిస్థితి! ఇకపైన… ముందు రోగి ఖాతాలో డబ్బులు వేస్తే, ఆ డబ్బులను బ్యాంకులు ఆటో డెబిట్‌ చేస్తాయంటూ మెలిక పెట్టారు. నేరుగా రావాల్సిన డబ్బులకే దిక్కులేదంటే… ఈ కొత్త మలుపులు ఏమిటని ఆస్పత్రి యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. ‘పారదర్శకత’ పేరిట చేస్తున్న ఈ ప్రయోగంపై అసంతృప్తివ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ప్యాకేజీలే ఆరోగ్యశ్రీ చికిత్సలకు అమలవుతాయి. చికిత్సకు సంబంధించిన నివేదికలను ఆరోగ్యశ్రీ ట్రస్టులో పూర్తిగా పరిశీలిస్తారు. ఆ తర్వాత రోగితో కూడా ఫోన్‌లో మాట్లాడతారు.‘చికిత్స బాగా అందిందా? ఆహారం అందించారా? ఆరోగ్యశ్రీ సేవల పట్ల సంతృప్తిగా ఉన్నారా? అదనంగా డబ్బులు వసూలు చేశారా?’ అని తెలుసుకుంటారు. ఇక… ట్రస్టు అధికారులు ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తారు. అయినా సరే… బిల్లులు మాత్రం సకాలంలో చెల్లించరు.

ఇప్పుడు… బిల్లుల చెల్లింపు ప్రక్రియలో రోగిని కూడా భాగస్వామి చేశారు. తన ఖాతాలో పడిన సొమ్మును బ్యాంకు అధికారులు ఆటో డెబిట్‌ ద్వారా ఆస్పత్రి ఖాతాకు పంపేందుకు అంగీకరిస్తున్నట్లు రోగి నుంచి ‘కన్సెంట్‌ ఫారం’పై సంతకం తీసుకోవాలట! రోగి అందుకు అంగీకరించకపోతే ఆస్పత్రి పరిస్థితి ఏమిటి? అలాకాకుండా… ‘ప్రభుత్వం మీ ఖాతాలో ఎప్పుడు డబ్బులు వేస్తుందో, అవి మాకు ఎప్పుడు వస్తాయో తెలియదు. ముందు మాకు డబ్బులు కడితేనే చికిత్స చేస్తాం.లేదంటే… మీరు వెళ్లిపోవచ్చు’ అని ఆస్పత్రులు చెబితే రోగి పరిస్థితి ఏమవుతుంది? ఇప్పటికే ఆరోగ్యశ్రీలో ఇచ్చే డబ్బులు సరిపోక చాలా ప్రైవేటు ఆస్పత్రులు రోగుల నుంచి అదనంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నాయి. ప్రభుత్వం తీసుకునే కొత్త నిర్ణయంతో ఈ వసూళ్లు మరింత పెరిగే ప్రమాదముంది. ఇదే జరిగితే క్యాష్‌ లెస్‌ చికిత్సల కోసం ప్రారంభించిన ఆరోగ్యశ్రీ… మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ పథకంగా మారిపోయే ప్రమాదముంది. ‘ఈ జంఝాటమంతా మాకెందుకు, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ నుంచి తప్పుకొంటాం’ అని కొన్ని ఆస్పత్రులు చెబుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular