TRS MLAs: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. అయితే ఇప్పటి నుంచే టీఆర్ఎస్, బీజేపీలు అధికారం కోసం పోటీ పడుతున్నాయి. ఈనేపథ్యంలో ఇరుపార్టీలు ఢీ అంటే ఢీ అంటూ కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో స్థానిక నేతలు టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ ముందుకు దూసుకెళుతున్నారు. టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు బీజేపీకి కలిసి వస్తుండటంతో ఆపార్టీ వరుస ఎన్నికల్లో విజయం సాధిస్తూ ఆపార్టీకి గట్టి సవాల్ విసురుతోంది.
తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కంటే ప్రజలు బీజేపీ వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఈ కారణంగానే రాష్ట్రంలో ఇటీవల జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు పట్టంకట్టినట్లు అర్థమవుతోంది. ఇదే సమయంలో టీఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్న నేతలంతా బీజేపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని బీజేపీ నేతలు పలుసార్లు మీడియా ముఖంగా వెల్లడించారు. త్వరలోనే టీఆర్ఎస్ నుంచి బీజేపీ వలసలు మొదలవుతాయని స్పష్టం చేస్తున్నారు.
తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలన, సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పలు సంచలనాలు నమోదు కావడం ఖాయమన్నారు. టీఆర్ఎస్ కు చెందిన చాలామంది ఎమ్మెల్యేలు, ఇతర నేతలు బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారని తెలిపారు. బీజేపీలోకి ఎవరూ వచ్చినా ఆహ్వానిస్తామని తెలిపారు. అయితే తన ద్వారా వచ్చే నేతలందరికీ టికెట్లు దక్కుతాయనే ఆశలు మాత్రం పెట్టుకోవద్దని చెప్పారు.
ప్రస్తుతం తన లక్ష్యం నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లను గెలువడంపైనే ఉందన్నారు. అలాగే ఉమ్మడి నిజామాబాద్ పరిధిలోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలను గెలువడం కోసం పని చేయనున్నట్లు తెలిపారు. పార్టీ ఆదేశిస్తే అసెంబ్లీ స్థానానికైనా పోటీ చేస్తానని అర్వింద్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనే ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు పారిపోవడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో బీజేపీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతుందన్నారు. ఈడీ నోటీసుల భయంతోనే కేసీఆర్ ఇటీవల హడావుడికి ఢిల్లీ వెళ్లారని అర్వింద్ విమర్శలు గుప్పించారు. ఇక తన తండ్రి ధర్మపురి శ్రీనివాస్ ఏ పార్టీలోకి వెళుతారనేది ఆయన ఇష్టమని, అందులో తన ప్రమేయం ఉండదని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. మొత్తానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి టచ్ లోకి వెళ్లడంతో మున్ముందు రాజకీయాలు ఎలాంటి పరిణామాలు తిరుగుతాయనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.