Telangana Elections 2023: తెలంగాణ ఫలితాలు మరో 48 గంటల్లో వెల్లడి కానున్నాయి. ఈ నెల 3న కౌంటింగ్ జరగనుంది. అయితే ఇంతట్లో ఎగ్జిట్ పోల్స్ సందడి చేశాయి. ఒకటి అరా తప్ప దాదాపు అన్ని సంస్థలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తేల్చేశాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలన్న బీఆర్ఎస్ ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. దీంతో రకరకాల విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ వైఫల్యాలు బయట పడుతున్నాయి. వాటిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
తెలంగాణ ప్రజలు కేసిఆర్ పై నమ్మకం ఉంచినా.. ఎక్కడికక్కడే స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరిగింది. వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను సైతం ఈసారి కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ప్రత్యామ్నాయ నేతలు ఉన్నా కూడా.. పార్టీలో విభేదాలకు అవకాశం ఇవ్వకుండా ఎక్కువ మంది సిట్టింగ్ లకే తిరిగి టిక్కెట్లు ఇచ్చారు. ఇది ప్రజలకు మింగుడు పడలేదు. నన్ను చూసి ఓటేయండి అన్న కెసిఆర్ మాటలను విశ్వసించలేదు. ఎన్నికల ప్రచారంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజలు బాహటంగానే ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్నిచోట్ల నిలదీసినంత పని చేశారు. అయినా సరే కెసిఆర్ దిద్దుబాటు చర్యలకు దిగలేదు.
సంక్షేమ పథకాల విషయంలో లబ్ధి దక్కని వారు ప్రభుత్వానికి శత్రువులుగా మారిపోయారు. ముఖ్యంగా దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ వంటివి అందనివారు ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుకున్నారు. ఈ రెండు పథకాలు గణాంకాలకి తప్ప.. క్షేత్రస్థాయిలో మాత్రం విమర్శలను మూటగట్టుకున్నాయి. సంక్షేమ పథకాల అమలులో విపరీతమైన రాజకీయ జోక్యం పెరగడం కూడా బీఆర్ఎస్ కు మైనస్ గా మారింది. పథకాలు పొందిన వారు.. పొందని వారు.. ఇలా అన్ని వర్గాల వారు ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుకున్నారు. బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇక యువతలో ప్రభుత్వంపై ఒక రకమైన వ్యతిరేకత ఉంది. ప్రధానంగా కేసీఆర్ హయాంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడలేదన్నది ఒక విమర్శగా ఉంది. ఈ కారణంగానే ఎక్కువ మంది యువత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఒకసారి మార్పు చేద్దామన్న ఆలోచన, సంక్షేమ పథకాలు ఎవరైనా ఇస్తారు అన్న భావన, సీమాంధ్ర ఓట్లు, సెటిలర్స్, రెండు సామాజిక వర్గాల ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లీ నట్లు.. అందుకే ఆ పార్టీకి తెలంగాణ ప్రజలు జై కొట్టినట్టు విశ్లేషణలు ఉన్నాయి.