Education in AP: ఏపీలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. దేశానికి ఆదర్శమైన విద్య ఏపీలో అందుతోందని ఆర్భాటం చేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదని తేలుతోంది. తాజాగా ఓ సర్వేలో 14 సంవత్సరాలు ఉండే విద్యార్థులు సైతం రెండో తరగతిలో ఉన్న వాక్యాలను చదవలేక పోతున్నారని తేలింది. జాతీయస్థాయిలో ప్రథమ్ అంటే సంస్థ సర్వే చేసింది. 28 జిల్లాల్లో అధ్యయనం చేసింది. మన రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో సర్వే కొనసాగింది. ఆసక్తికర పరిణామాలు వెలుగు చూశాయి.
గతంలో ఏదైనా సంఖ్యలు, గుణింతలు, పదాలు అడిగినప్పుడు చుటుక్కున సమాధానం చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి దానికి చిన్నారులు సెల్ ఫోన్ పై ఆధారపడుతున్నారు. ఆన్ లైన్ సమాధానాలకి పరిమితమవుతున్నారు. లెక్కలు అడిగితే సెల్ ఫోన్ క్యాలిక్యులేటర్లో చూసి సమాధానం చెబుతున్నారు. తాజాగా ఈ సర్వేలో అదే తేలింది. విద్యార్థుల్లో 88% మంది సెల్ ఫోన్లు వినియోగిస్తున్నట్లు స్పష్టమైంది. అటు పిల్లల్లో యూట్యూబ్ వీడియోలు చూసినవారు సైతం ఎక్కువేనని తేలింది.
14 నుంచి 16 సంవత్సరాల మధ్య వయసున్న వారిలో 24.6% విద్యార్థులు రెండో తరగతి పాఠ్యపుస్తకంలోని పదాలు, వాక్యాలు చదవలేక పోతున్నారు. 41.4 శాతం మంది చిన్నచిన్న బాగా హారాలు చేయలేకపోతున్నారు. 28.9 శాతం మంది ఇంగ్లీషులోని చిన్న వాక్యాలను కూడా చదవలేక పోతున్నారు. 39.6% మంది టైమును కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు. అసలు బరువును ఎలా కొలుస్తారు కూడా 43.4 శాతం మందికి తెలియదు. సులభమైన పొడవులను లెక్కించడం 9 శాతం మందికి, కష్టమైన వాటిని లెక్కించడం 39.2 శాతం మంది అసలు తెలియదు.
17 నుంచి 18 ఏళ్ల వయసు వారిలో 24.2% మంది విద్యార్థులకు చిన్న చిన్న పదాలు, వాక్యాలు చదవలేక పోతున్నారు. 14 నుంచి 18 ఏళ్ల వయసు వారిలో చూస్తే 24.5% మంది విద్యార్థులకు అక్షర జ్ఞానం లేకుండా పోయింది. ఈ సర్వే ఫలితాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగంలో సమూల మార్పులు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. నాడు నేడు పథకంతో పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని.. ఇంగ్లీష్ మీడియం తో పాటు ఆన్ లైన్ బోధన విస్తృతమైందని చెప్పుకొస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఈ సర్వే ఫలితాలు చూస్తే మాత్రం.. విద్యావ్యవస్థ దారుణమైన స్థితిలో ఉందని తేలుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. గుణాత్మకమైన విద్యను మెరుగుపరచాల్సి ఉంది.