AP BJP:మొన్న రూ.50కే చీప్ లిక్కర్ వివాదం.. బీజేపీని ఎంత డ్యామేజ్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆఖరు పక్క రాష్ట్ర మంత్రి కేటీఆర్ సైతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిని టార్గెట్ చేసి జాతీయ మద్యం పాలసీగా చేయండి అంటూ సెటైర్లు వేశారు. దాన్ని కవర్ చేయడానికి నానా తిప్పలు పడుతున్న వేళ నేడు ఏకంగా బీజేపీ పార్టీ ఆఫీసులోనే ఐటెం సాంగ్ లతో నేతలు చిందులు తొక్కారు. మరోసారి సోషల్ మీడియాలో టార్గెట్ అయ్యారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలను, సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి ఏపీ బీజేపీ వ్యవరిస్తున్న ఈ విచ్చలవిడి విధానాలపై విమర్శల వాన కురుస్తోంది.
ఇటీవలే విజయవాడలో నిర్వహించిన ప్రజా ఆగ్రహ సభలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చీప్ లిక్కర్ పై చేసిన కామెంట్స్ సెగ ఇప్పటికీ సద్దుమణగడం లేదు. దీని మీద రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇదే మా 2024 మేనిఫెస్టోలోనూ పెడుతామని సోము వీర్రాజు చేసిన ప్రకటన మరింతగా విమర్శలపాలైంది. ఈ విషయంలో ముప్పేట దాడిని బీజేపీ నాయకులు ఎదుర్కొంటున్నారు. దీన్ని ఎలా సమర్థించుకోవాలో తెలియక బీజేపీ జాతీయ నాయకులు కూడా తికమకపడుతున్నారు.
ఈ క్రమంలోనే ఏపీలో గుంటూరులోని జిన్నాటవర్, విశాఖలోని కింగ్ జార్జి ఆస్పత్రి పేరు మార్పు డిమాండ్ ను బీజేపీ నేతలు తెరపైకి తీసుకొచ్చారన్న అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఇంత రచ్చ జరుగుతున్న క్రమశిక్షణకు మారుపేరైన బీజేపీలో మరో ఉపద్రవం చోటుచేసుకుంది.
ఇప్పుడు బీజేపీకి మరో సరికొత్త సమస్య నెత్తిమీద పడింది. కొత్త సంవత్సరం నాడు విజయవాడ బీజేపీ సిటీ కార్యాలయం ఇందుకు వేదికైంది. బీజేపీ విజయవాడ సిటీ పార్లమెంట్ నియోజకవర్గం కార్యాలయంలో కొందరు నాయకులు ఐటెం సాంగ్ లకు చిందులేయడం వైరల్ అయ్యింది. ఎన్టీఆర్ ‘ఆరేసుకోబోయి పారేసుకున్నారు’ అనే పాటకు ఆడ, మగ బీజేపీ నాయకులు స్టెప్పులేసిన తీరు చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. మహిళా బీజేపీ నాయకులు సైతం ఇలా రెచ్చిపోవడం చూసి అంతా అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బీజేపీ నాయకుల తీరు ఇదీ అని ప్రత్యర్థులు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఘాటు పదాలతో బీజేపీపై సోషల్ మీడియాలో ఆరోపణలు సంధిస్తున్నారు.
ఈ వీడియోను ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, విష్ణు లాంటి వారికి ట్యాగ్ చేసి మరీ నెటిజన్లు నిలదీస్తున్నారు. ఆర్ఎస్ఎస్ , బీజేపీ నేర్పించిన సంస్కృతి ఇదేనా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. మొత్తాని ఈ ఒక్క వీడియో బీజేపీ పరువును గంగపాలు చేస్తోంది.
*విజయవాడ బీజేపీ సిటీఆఫీసులో నేతల డ్యాన్సులు
https://twitter.com/sweety_7799/status/1477457877245722628?s=20