AP Energy Saving : ఏపీలో వైసీపీ సర్కారుకు కాస్తా ఉపశమనం. ఇప్పటికే పాలనా వైఫల్యాలను మూటగట్టుకుంటున్న జగన్ సర్కారు ఒక అంశంలో మాత్రం ముందడుగు వేసింది. దేశంలో ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన స్థితిలో నిలిచింది. ఇంధన పొదుపులో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఎనర్జీ ఎఫిషియన్సీలో మిగిలిన రాష్ట్రాలకు ఏపీ బ్రాండ్ నిలుస్తోంది. ఏటా ఇంధన పొదుపు ద్వారా రూ.3,500 కోట్లు ఆదా చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీ ద్వారా ఇంధన పొదుపునకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇవి సత్ఫలితాలనిచ్చినట్టు కనిపిస్తోంది. ఇంధన సామర్థ్య నిర్వహణలో ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) చక్కటి పనితీరు కనబరచిందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తలెత్తింది. వైసీపీ సర్కారు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో వినియోగానికి తగ్గట్టు విద్యుత్ లభ్యం కాలేదు. దీంతో గృహ అవసరాలకు తగినంతగా కూడా సప్లయ్ లేకపోయింది. దీంతో విద్యుత్ కోతలు అధికమయ్యాయి. ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. విద్యుత్ తయారీకి అవసరమైన ముడిసరుకులు సమకూర్చుకోవడంలో వైసీపీ ఫెయిలైనట్లు ప్రచారం జరిగింది. ఇది ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో ప్రభుత్వం విద్యుత్ ఆదాపై దృష్టిపెట్టింది. ఇందుకుగాను స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీని ఏర్పాటుచేసింది. ఇంధన పొదుపునకు ప్రాధాన్యమిచ్చింది. పరిశ్రమలకు పవర్ హాలీడేస్ ప్రకటించింది. మరో ముందడుగు వేసి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) ప్రమాణాలకు అనుగుణంగా ఇంధన సామర్థ్య చర్యలను పటిష్టంగా అమలుచేసింది.
ఇప్పటికే పవర్ ప్లాంట్స్, సిమెంట్, టెక్స్‌టైల్స్, డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఇలా.. రాష్ట్రంలోని మొత్తం 53 గుర్తింపు పొందిన భారీ పరిశ్రమలు బీఈఈ ప్రమాణాలకు అనుగుణంగా ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేస్తున్నాయి. దీని ద్వారా 3,430 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను ఆదా చేశాయి. దీని ద్వారా పెర్‌ఫార్మ్ అచీవ్ ట్రేడ్ (ప్యాట్) అమలులో ఏపీ ఇప్పటికే అద్భుతమైన పనితీరు కనబరుస్తోంది. ఏపీలోని పరిశ్రమల్లో ఇంధన పొదుపు ద్వారా ఏటా రూ.3,500 కోట్లు ఆదా అవుతోందని గణాంకాలు చెబుతున్నాయి. అందుకే ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ రాష్ట్రపతి అవార్డును సొంతం చేసుకుంది.
ఏపీ స్ఫూర్తితో ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) వినూత్న కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించింది. ఇంధన పొదుపుపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన పెంచాలని డిసైడ్ అయ్యింది. ముఖ్యంగా విద్యార్థుల ద్వారా కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల ఎనర్జీ క్లబ్ లు ఏర్పాటుచేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఒక్కో క్లబ్ నకు రూ.10 వేలు అందించాలని భావిస్తోంది. ఈ క్లబ్ లు విద్యార్థులకు ఇంధన పొదుపుపై అవగాహన కల్పిస్తాయని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కార్యదర్శి ఆర్ కె రాయ్ తెలిపారు.