
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి, సీఎంగా జగన్ పీఠాన్ని అధిరోహించి రెండేళ్లు అవుతోంది. వైసీపీలో ఇప్పటికే పదవుల కోసం అనేక మంది ఎదురుచూస్తున్నారు. మంత్రి పదవి దక్కే అవకాశాలు లేవు. కేబినెట్ ర్యాంకు ఉన్న పదవుల కోసం ఎమ్మెల్యేలు రెండేళ్లుగా వేచి చూస్తున్నారు. కీలకమైన నేతలకు కెబినెట్ ర్యాంకు పదవులు ఇచ్చేందుకు జగన్ తొలినాళ్లు సిధ్దం అయ్యారు. ఏపీలో ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
అయితే ఇప్పటి వరకు ప్రాంతీయ అభివృద్ధి మండళ్ల ఏర్పాటు సాధ్యం కాలేదు. ఆ ఆలోచన కూడా జగన్ చేయడం లేదు. ఉత్తరాంధ్రలో విజయనగరం కేంద్రంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం ఒక ప్రాంతీయ అభివృదధి మండలి, కాకినాడ కేంద్రంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు కేంద్రంగా ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలు, కడప కేంద్రంగా చిత్తూరు కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలతో అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మూడేళ్లు మాత్రమే కాల వ్యవధిగా నిర్ణయించారు.
ఒక్కో అభివృద్ధి మండలికి ఒక చైర్మన్ ఉంటారు. మంత్రి పదవి దక్కే అవకాశం లేని వారికి ప్రాంతీయ మండలి చైర్మన్ గా అవకాశం ఇవ్వాలని అప్పట్లో జగన్ నిర్ణయించారు. కొన్ని సామాజిక సమీకరణల కారణంగా తొలివిడత సీనియర్ నేతలకు కూడా మంత్రి పదవి దక్కలేదు. కొలగట్ల వీరభద్రస్వామి, కొలుసు పార్థసారథి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి తదితర పేర్లు వినిపించాయి. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు తరువాతనే ఈ అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
అంటే జగన్ తన మంత్రి వర్గాన్ని మరో ఆరునెలల్లో విస్తరించనున్నారు. అంతకు ముందే ఈ అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మంత్రి పదవితో సమానమైన కేబినెట్ ర్యాంకు హోదా ఉన్న పదవి కావడంతో అనేకమంది వైసీపీ సీనియర్ నేతలు దీనిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ మంత్రి వర్గ విస్తరణ లోపు వీరి ఆశలు నెరవేరే అవకాశాలు లేవు. ప్రస్తుతం జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలపైనే దృష్టి పెడుతుండడంతో ప్రాంతీయ అభివృద్ధి మండళ్లకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.