AP Politics: ఏపీ రాజకీయాల్లో ఉత్తరాంధ్ర సీనియర్ నేత ‘గంటా శ్రీనివాసరావు’ది ప్రత్యేకమైన శైలి. ఈ దిగ్గజ కాపు నాయకుడు సరిగ్గా అధికారంలోకి వచ్చే పార్టీని ఎంచుకొని ఎన్నికల ముందర పార్టీ మారి మంత్రి పదవులు చేజిక్కించుకుంటారు. నాడు కాంగ్రెస్ లో.. ఆ తర్వాత ప్రజారాజ్యంలో.. 2014లో టీడీపీలో చేరి ఇలానే మంత్రి పదవి దక్కించుకున్నారు. 2019లో మాత్రం ‘గంటా’ వస్తానన్న జగన్ రానీయలేదన్న టాక్ నడిచింది. అలా ఈసారి ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. అయితే టీడీపీ మళ్లీ గెలిచే అవకాశం లేదని ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా ‘కాపుల కోసం పార్టీ’ పెట్టే ఆలోచనలో ఉన్నారని ప్రచారం సాగుతోంది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ వంటి కాపు నేతలతో కలిసి విశాఖలో సమావేశమైన గంటా తన వంతు లాబీయింగ్ మొదలుపెట్టారని టాక్ నడుస్తోంది.
కాపుల ఐక్యత పేరుతో సాగుతున్న మీటింగ్ లతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. నేతలు కూడా ఎటు వైపు బాగుంటే అటే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు మరో రెండేళ్లు ఉండగానే నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇందులో భాగంగా జనసేన కూడా తన బలాన్ని నిరూపించుకోవాలని భావిస్తోంది. దీనికి ముఖ్య నేతలను తమ పార్టీలో చేర్చుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావును తమ సంధానకర్తగా నియమించి కాపులను ఏకం చేయాలని భావిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.. గంటా కూడా జనసేనలో చేరి దాన్ని ఓ స్థాయికి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి గాను అంతా కుదిరితే జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
మరోవైపు రాష్ర్టంలో కాపు వర్గానికి అన్యాయం జరుగుతోందని ఆ సామాజికవర్గంలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. రాజకీయ పార్టీలు తమ సేవలను వినియోగించుకుంటూ అధికారం చెలాయిస్తున్నా తమకేమీ ప్రయోజనం దక్కడం లేదనేది వారి వాదన. ఈ క్రమంలో కాపులను గాడిలో పెట్టి అధికారం హస్తగతం చేసుకోవాలనే ఉద్దేశంలో నేతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి గాను కార్యాచరణ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.
గత ఎన్నికల్లో అత్యధిక శాతం కాపు సామాజికవర్గం వైసీపీకి వెన్నంటి నిలిచినా ప్రయోజనం మాత్రం శూన్యమే. జగన్ హామీలు అధికారంలోకి వచ్చాక నెరవేరలేదు. దీంతో ప్రస్తుతం వైసీపీకి టాటా చెప్పేసి జనసేనతో జట్టు కట్టాలని భావిస్తున్నారు. పొత్తుల్లో భాగంగా జనసేన బీజేపీ-టీడీపీలతో సాగే అవకాశాలు మెండుగా ఉండటంతో కాపు నేతల చూపుంతా ఈ కూటమివైపు మళ్లినట్లు తెలుస్తోంది. కాపుల కొత్త పార్టీ పెట్టి జనసేనతో కలిసి సాగుతూ.. పవన్ కల్యాణ్ ను సీఎం చేస్తేనే పొత్తు పెట్టుకుంటామని అల్టిమేటం జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు చంద్రబాబు కూడా ఒంటరిగా జగన్ ను ఎదుర్కొనే సత్తా లేకుండా ఉండటంతో కాపులకు ఇది కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది.
టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు ప్రస్తుతం జనసేన పార్టీలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. తన కొత్త కాపుల పార్టీ పెట్టినా జనసేనతోనే సాగేందుకు యోచిస్తున్నట్టు సమాచారం.. పవన్ కల్యాణ్ ను సీఎంగా చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసమే ఆయన కార్యాచరణ ప్రణాళికలు రచిస్తున్నట్లు చెబుతున్నారు. కాపులకు అధికారం సాధించడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది.. దీని కోసమే ఆయన జనసేన పార్టీకి జవసత్వాలు నింపాలని చూస్తున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో జనసేన-బీజేపీ కూటమి కనీసం 40-50 అసెంబ్లీ సీట్లు సాధిస్తే పవన్ ను సీఎంగా చేసేలా గంటా స్కెచ్ గీసినట్టు చెబుతున్నారు. కర్ణాటకలో ఎలా అయితే తక్కువ సీట్లు వచ్చిన కుమారస్వామి సీఎం అయ్యారో అలానే ఏపీలోనే జనసేనను కింగ్ మేకర్ గా చేయాలని గంటా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. మరి ఇది సాధ్యమవుతుందా? గంటా జనసేనకు మద్దతుగా నిలుస్తారా? కాపుల కొత్త పార్టీ రూపుదిద్దుకుంటుందా? అన్నది రాబోయే రోజుల్లోనే తేలనుంది.