AP BJP: ఏపీలో బిజెపి బలం అంతంత మాత్రం. కానీ రాజకీయాలను ప్రభావితం చేసేలా ఆ పార్టీ ఉంది. కేంద్రంలో అధికారంలో ఉండడమే అందుకు కారణం. గెలుపోటములను నిర్దేశించే స్థాయిలో ఆ పార్టీ ఉండడంతో.. తమకు ఏది ప్రయోజనం అనుకుంటే అలా వ్యవహరించేందుకు ఆ పార్టీ సన్నద్ధం అవుతోంది. సీట్లు, ఓట్లు పరంగా ఒక ఆలోచన కాగా.. రాజకీయ కోణంలో మరోలా ఆలోచిస్తోంది. అంతిమంగా సింహ ప్రయోజనాల వైపే భారతీయ జనతా పార్టీ మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే ఏపీలో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. బిజెపి కలిసి వస్తుందని భావిస్తోంది. బిజెపి నుంచి ఎటువంటి స్పష్టత లేదు. కానీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి. అయితే పొత్తులో భాగంగా బిజెపి 10 పార్లమెంట్ స్థానాలను అడుగుతోందని.. కానీ టిడిపి నుంచి ఐదు నుంచి ఏడు స్థానాలు ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని వార్తలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కు పార్లమెంట్ సీట్లు తగ్గుతాయని ఒక అంచనా ఉంది. ఈ తరుణంలో ఏపీ నుంచి వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బిజెపి నేతలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే వైసీపీతో రాజకీయ స్నేహం బిజెపికి కుదిరే పని కాదు. నేరుగా పొత్తు పెట్టుకోవడానికి కూడా వీలులేదు. ఏదైనా రాజకీయ పరస్పర సహకారం అందించుకోవడం వరకే కానీ.. నేరుగా కలిస్తే రెండు పార్టీలకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. అందుకే వైసిపి సైతం బిజెపి ఒంటరి పోరాటం చేయాలని భావిస్తోంది. అదే తమకు శ్రేయస్కరమని ఆలోచన చేస్తోంది. ఎన్నికల అనంతరం తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని బిజెపి నాయకత్వానికి జగన్ భరోసా ఇస్తున్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ చంద్రబాబుతో కలిస్తే మేలా? లేకుంటే జగన్ సలహా మేరకు ఒంటరి పోరాటం చేస్తే మేలా? అని ఆలోచిస్తున్నారు. కానీ గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబుతో కలిసి ఎందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదు. గత నాలుగు సంవత్సరాలుగా జగన్ అందించిన స్నేహాన్ని మాత్రం గుర్తు చేసుకుంటున్నారు. అయితే మారిన జాతీయ రాజకీయ పరిణామాల నేపథ్యంలో పొత్తులో భాగంగా ఐదు ఆరు పార్లమెంటు స్థానాలైనా వస్తాయని.. ఆపై చంద్రబాబును వదులుకుంటే ఇండియా కూటమి వైపు వెళ్లే అవకాశం ఉందని బిజెపి ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఏపీపై రాజకీయ పట్టు వదులుకోకూడదని బిజెపి భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం అనివార్యంగా మారడంతో.. సీరియస్ గా ఆ పార్టీ మేధో మధనం చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టతనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.