AP Capital Issue: రాజధాని విషయంలో అధికార వైసీపీ నాయకులు కొత్త పల్లవిని అందుకున్నారా? విశాఖ వాసుల్లో సెంటిమెంట్ నింపే ప్రయత్నం చేస్తున్నారా? ఉత్తరాంధ్ర ప్రజల మద్దతు కూడగట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అమరావతిని శాసన రాజధానికే పరిమితం చేసి విశాఖలో పాలనా రాజధాని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తద్వారా మూడు ప్రాంతాలను ప్రాధాన్యమిచ్చినట్టు చెబుతున్నారు. అయితే కర్నూలు హైకోర్టు ఏర్పాటును జిల్లా ప్రజలతో పాటు సీమవాసులు ఆహ్వానించినా విశాఖ పాలనా రాజధానిపై మాత్రం ఏమంత సుముఖంగా లేరు. కొస్తాంధ్ర ప్రజలు సహజంగానే అమరావతిని నిర్లక్ష్యం చేయడంపై
మండిపడుతున్నారు. పోనీ విశాఖ వాసులు, ఉత్తరాంధ్ర ప్రజలు సైతం తమ ప్రాంతంలో పాలనా రాజధాని ఏర్పాటవుతుందని ఆనందంగా లేరు. సహజంగా ఇది అధికార వైసీపీకి ఏ మాత్రం మింగుడు పడడం లేదు. ఇక్కడి ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చేందుకు అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేసినా ప్రజల్లో ఏ మాత్రం చలనం లేదు. దీంతో అధికార పార్టీ నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అటు అధిష్టానంకూడా సీరియస్ గా ద్రుష్టిసారించింది. ప్రజల్లో విశాఖ రాజధానిపై ప్రచారం చేయాలని నిర్ణయించింది.
ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జి, ఎంపీ విజయసాయిరెడ్డి మూడు జిల్లాల్లో సభలు, సమావేశాలు పెట్టాలని నిర్ణయించారు. ఈ మూడు జిల్లాల్లో35 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గడచిన ఎన్నికల్లో 28 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే ఈసారి ఎన్నికల్లో గెలుపు అంతా ఆశాజనకంగా లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వమని జనసేన అధినేత పవన్ హెచ్చరికల నేపథ్యంలో వైసీపీ అధిష్టానం జాగ్రత్త పడుతోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, విభేదాలను పరిష్కరించాలని సంబంధిత బాధ్యులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని 35 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులతో విజయసాయి సమావేశం కానున్నారు. అన్నింటిపై కులంకుశంగా చర్చించనున్నారు. పనిలో పనిగా ఉత్తరాంధ్ర పాలనా రాజధానిపై మద్దతు కూడగట్టనున్నారు. నియోజకవర్గాల్లో ప్రజలను ఏ విధంగా సెంటిమెంట్ రగల్చాలో దిశ నిర్దేశం చేయనున్నారు. వాస్తవానికి ఉత్తరాంధ్రకు పాలనా రాజధాని వస్తున్నా స్థానికులు ఆనందంతో ఊగిపోలేదు. అలాగని వ్యతిరేకించనూ లేదు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రజల నుంచి హర్షాతిరేకాలు వస్తాయని భావించింది. కానీ విశాఖ పాలనా రాజధాని ప్రకటించిన తరువాత మిగతా ప్రాంతాల ప్రజల నుంచి ప్రభుత్వం వ్యతిరేకతను మూటగట్టుకుంది. పైగా వందల కోట్లతో నిర్మించిన అమరావతిని పక్కన పెట్టడం, రెండేళ్లుగా ప్రకటనలకే పరిమితం కావడం, రాజధాని లేని రాష్ట్రంగా దేశ చిత్రపటంలో ఉండడం తదితర కారణాలతో మెజార్టీ ప్రజలు ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.
పాలనా రాజధాని ప్రకటన తరువాత విశాఖలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. రాయలసీమ, కొస్తా నేతల ప్రమేయం ఎక్కువైంది. భూముల వ్యవహారాలు, సెటిల్ మెంటుల్లో ఆయా నాయకుల జోక్యం పెరిగిపోయింది. దీనిపై ప్రచారం కూడా ఆ స్థాయిలో జరిగిపోయింది. అయితే ఈ పరిణామాలతో విశాఖ నగర ప్రజల్లో ఒక రకమైన భయం ఏర్పడింది. సాగరమంతా విశాలమైన నగర వాసుల్లో అనుమానాలు సైతం పెరిగిపోయాయి. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వ పాలనా అవసరాలకు, నవరత్నం పథకాల నిధులకు ఎంతో చరిత్ర కలిగిన పురాతన భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టులోకి వెళ్లిపోయాయి. వీటిపై విపక్షాలు ఆరోపణలు చేస్తుండగా, మీడియాలో ప్రథాన శీర్షికన కథనాలు రావడంతో ప్రజలు మరింతగా భయాందోళనకు గురవుతున్నారు. రాజధాని వస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని నమ్ముతున్నారు. అందుకే రాజధాని విషయంలో లైట్ తీసుకుంటున్నారు. పైగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమ సెగ అధికార వైసీపీకి తగులుతోంది. రాష్ట్ర ప్రభుత్వ మద్దతు లేకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం సాధ్యమయ్యే పనికాదని మెజార్టీ ప్రజలు భావిస్తున్నారు.వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్ ను కాపాడలేని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర పాలనా రాజధాని తో ఉద్ధరిస్తాదనుకుంటే ఎలా నమ్మేదంటూ ఎక్కవ మంది ప్రశ్నిస్తున్నారు.