
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న పార్టీలలో తెలుగుదేశం పార్టీ ఒకటి. ఆ పార్టీ తరపున చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్ర ప్రదేశ్ లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశారు. అయితే 2014 సంవత్సరంలో సీఎంగా గెలిచిన తరువాత చంద్రబాబు చేసిన కొన్ని పొరపాట్లు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల 2019 సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది.
రాష్ట్రంలో రోజురోజుకు టీడీపీ బలహీనపడుతోంది. 2024 సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అసెంబ్లీ స్థానాల సంఖ్య మరింత తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేశ్ ను ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో పార్టీ ఓడిపోతుందని భావించిన చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ నేతలు భావిస్తున్నారు.
అయితే ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుందని టీడీపీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. ఒక సర్వేలో 70 శాతానికి పైగా ప్రజలు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తే పార్టీ పరిస్థితి మెరుగుపడటంతో పాటు పార్టీ బలపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రావాలని ప్రజలు కూడా కోరుకుంటూ ఉండటం గమనార్హం.
సినిమాలు, రియాలిటీ షోలతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ రోజురోజుకు పార్టీ బలహీనపడుతున్న నేపథ్యంలో పార్టీలోకి ఎంట్రీ ఇచ్చి యాక్టివ్ గా ఉంటారేమో చూడాల్సి ఉంది. చంద్రబాబు, బాలకృష్ణ ఆహ్వానిస్తే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో యాక్టివ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.