తీవ్రమైన రాజకీయ వత్తిడుల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ అధికారులు కరోనా నియంత్రణలో తమ బాధ్యతలను నిస్పక్షపాతంగా నిర్వహింపలేక పోతున్నారని సీనియర్ బిజెపి నేత, పార్టీ ఎమ్యెల్సీ పివి మాధవ్ ఆరోపించారు. అధికార పక్ష నేతల నుండి వస్తున్న వత్తిడుల కారణంగా వారు `కీలు బొమ్మలు’గా వ్యవహరింప వలసి వస్తున్నదని ధ్వజమెత్తారు.
రాజకీయ జోక్యం కారణంగా కరోనా కట్టడిలో అధికారులు సమర్ధవంతంగా పనిచేయలేక పోతున్నారని చెబుతూ కరోనాకు సంబంధించిన వాస్తవాలను ప్రభుత్వం ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.
పొరుగున ఉన్న నగరం కర్నూల్ కు వెళ్లిన బిజెపి నేత విష్ణు వర్ధన్ రెడ్డిని గృహనిర్బంధం కావించిన అధికారులు విచ్చలవిడిగా తిరుగుతున్న వైసిపి ఎంపీ, ఎమ్యెల్యేలను ఎందుకని కట్టడి చేయలేక పోతున్నారని మాధవ్ ప్రశ్నించారు.
అధికార పక్షానికి చెందిన నాయకులు లాక్ డౌన్ ను ఉల్లంఘించడంతో పాటు సాంఘిక దూరం పాటించకుండా, మాస్క్ లు లేకుండా, గుంపులుగా తిరుగుతున్నా అధికారులు మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం కరోనా ఉధృతిని, లాక్ డౌన్ ను పట్టించుకోకుండా విశాఖపట్నంలో భూసేకరణలో నిమగ్నం కావడం పట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలోని భూములను కరోనాను, హైకోర్టు ఉత్తర్వులను ప్రక్కన పెట్టి స్వాధీనం చేసుకుంటోందని విమర్శించారు.
కరోనా నేపథ్యంలో మే 31వ తేదీ వరకు భూములకు సంబంధించి ఎటువంటి లావాదేవీలు జరపకూడదని మాధవ్ హెచ్చరించారు. కాగా, తమ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన అసందర్భపు ఆరోపణలపై కోర్ట్ కు వెళ్లాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిపారు.
దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా చిక్కుకు పోయిన మత్స్యకారులను వారి ప్రాంతాలకు తరలించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మాధవ్ తెలిపారు.