మొన్న నీటి వివాదంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను తిట్టిన నోటితోనే నేడు పొగిడేశాడు ఏపీ మంత్రి పేర్ని నాని. తాజాగా తెలంగాణలో పర్యటించిన ఆయన పాత పగలు అన్ని మాని తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కార్ ఇచ్చిన స్వాగతానికి మైమరిచి పోయి యాదాద్రిని సందర్శించి పులకించిపోయారు. కేసీఆర్ ఏపీకి నీళ్లు కట్ చేసినా కూడా ఆయనను ఏపీ మంత్రి పేర్ని నాని పొగడడం హాట్ టాపిక్ గా మారింది.
ఏపీ మంత్రి పేర్ని నాని తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చారు. యాదాద్రి నరసింహస్వామిని సందర్శించుకున్నారు. మొక్కలు తీర్చుకున్నారు. అనంతరం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఫిదా అయ్యాడు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అత్యద్భుతం అని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. శుక్రవారం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని మంత్రి దర్శించుకొని ఆలయ పనులు అద్భుతమని కొనియాడారు.
మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. స్వామి వారి ఆలయాన్ని చాలా చిత్తశుద్ధితో పూర్తి సంప్రదాయంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులకు నచ్చేలా నిర్మించడం చాలా గొప్ప విషయం అన్నారు. తిరుపతి ఆలయాన్ని శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించడం ప్రస్తుతం చరిత్రంగా చెప్పుకుంటున్నామని.. అలాగే భవిష్యత్తులో యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్ నిర్మించారని చెప్పుకుంటారని.. ఏకంగా కేసీఆర్ ను శ్రీకృష్ణ దేవరాయలుతో పోల్చారు ఏపీ మంత్రివర్యులు. కేసీఆర్ ను దేవుడిని చేసేశారు..
దేవుడి ఆశీస్సులతో కేసీఆర్ సంకల్పం తప్పకుండా నెరవేరాలని సగటు ఏపీ పౌరుడిగా మంత్రి కోరుకోవడం విశేషం. మొత్తం పైకి మాత్రమే కొట్లాట కానీ.. లోపల మాత్రం వైసీపీ నేతలకు, కేసీఆర్ ఏంతో అవినాభావ సంబంధం ఉందని తేటతెల్లమవుతోంది.