Perni Nani Mohan Babu: మెగాస్టార్ చిరంజీవి సహా అగ్రహీరోలు, దర్శకులతో భేటి అయిన ఏపీ సీఎం జగన్ టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు.అయితే ‘మా’ అధ్యక్షుడు.. సినీ ఇండస్ట్రీ ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణును.. లేఖలతో నిలదీస్తున్న మంచు మోహన్ బాబును జగన్ పట్టించుకోలేదు. చిరంజీవితోపాటు సమావేశానికి పిలవలేదన్న ప్రచారం సాగింది. పిలిచినా మంచు మోహన్ బాబు వెళ్లలేదో తెలియదు. స్వయంగా బావమరిది విష్ణు, మామయ్య అయ్యే మోహన్ బాబును జగన్ ఎందుకు విస్మరించి చిరంజీవికి పెద్ద పీట వేశాడన్నది అంతుబట్టని వ్యవహారంగా మారింది. ఈ క్రమంలోనే మోహన్ బాబు, మంచు విష్ణు నొచ్చుకున్నారన్న ప్రచారమూ సాగింది.
ఇక ఇప్పటికే చిరంజీవిని ఒకసారి మంచు విష్ణు అవమానించేలా మాట్లాడారు. చిరంజీవి జగన్ ను కలిసింది వ్యక్తిగత వ్యవహారమని కొట్టిపారేశారు. వారి భేటిని తక్కువ చేసి చూపారు. ఈ క్రమంలోనే జగన్ తోపాటు పేర్నినాని, మహేష్, ప్రభాస్, రాజమౌళి అంతా చిరంజీవి వల్లే టాలీవుడ్ సమస్యలు తీరిపోయాయని.. ఆయనే ఇండస్ట్రీకి పెద్దదిక్కు అని మీడియా సమావేశంలోనే కుండబద్దలు కొట్టారు. దీంతో మంచు విష్ణును నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
చిరంజీవి వెళ్లి జగన్ తో చర్చలు జరిపింది టాలీవుడ్ బాగు కోసమేనని జగన్, మంత్రి పేర్ని నాని చెప్పడంతో విష్ణు ఇరుకునపడ్డారు. ఈ క్రమంలోనే ఏం జరిగిందో ఏమో కానీ.. సడెన్ గా ఏపీ మంత్రి పేర్ని నాని.. మోహన్ బాబు ఇంట్లో ప్రత్యక్ష మయ్యారు. హైదరాబాద్ కు వచ్చి మరీ మంచు మోహన్ బాబును పేర్ని నాని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సినీ సెలబ్రెటీలంతా జగన్ దర్శనం కోసం హైదరాబాద్ నుంచి అమరావతి వెళితే.. ఏకంగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రియే మోహన్ బాబు ఇంటికి రావడం విశేషంగా మారింది. నిజానికి మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహానికి మంత్రి పేర్ని నాని వెళ్లారు. మోహన్ బాబును జగన్, పేర్ని నాని విస్మరించారన్న విమర్శలకు చెక్ పెడుతూ ఈ కలయికతో మంచు ఫ్యామిలీ అసంతృప్తిని జగన్ చల్లార్చినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే మంచు విష్ణు.. మా ఇంటికి పేర్ని నాని వచ్చారని ట్వీట్ చేయడం.. అనంతరం తొలగించడం.. కేవలం మర్యాదపూర్వక భేటి అంటూ ముక్తాయింపు ఇవ్వడం జరిగిపోయింది. ప్రభుత్వ ప్లాన్లను తమకు అప్ డేట్ చేసినందుకు పేర్ని నానికి మంచు విష్ణు ట్వీట్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. అది దుమారం రేపడంతో దాన్ని డిలీట్ చేసి ఇక మా ఇంటికొచ్చినందుకు నానికి కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశాడు.
దీన్ని బట్టి సినీ ప్రముఖులందరినీ తన ఇంటికి రప్పించుకున్న సీఎం జగన్.. తన బంధువు అయిన మోహన్ బాబు ఇంటికే ఏపీ మంత్రిని పంపి తన ప్రాధాన్యత మోహన్ బాబుకేనని చెప్పకనే చెప్పారు. కానీ చర్చల్లో ఆయనను ఎందుకు విస్మరించారన్నది మాత్రం అంతుచిక్కడం లేదు.