
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి (Balineni) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘రేవంత్ క్యారెక్టర్ లెస్ ఫెలో’ అంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారు. ఆయనకంటూ ఒక ఎజెండా ఏదీ లేదని ఎవరో ఏదో చెబితే.. ఆయన చేస్తాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ పార్టీ కాదని, తెలుగు కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు.
అమరావతిపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మంత్రి బాలినేని పై విధంగా వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి మాట్లాడుతూ.. భారత పౌరుడిగా బాధపడుతున్నానని అన్నారు రేవంత్. దీనిపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ.. టీడీపీ అధినేత చంద్రబాబు అంటేనే ఆయనకు ఇష్టమని, ఆయన ఏది చెబితే.. అదే మాట్లాడుతారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి పార్టీ అంటూ ఏమీ లేదని అన్నారు. అమరావతి గురించి ఆయనకు అవసరం ఏముందని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టి.. కార్యనిర్వాహక రాజధాని అక్కడ పెట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కేవలం చంద్రబాబు చెప్పినందుకే.. రేవంత్ ఇలా మాట్లాడారని అన్నారు. ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ.. మరో పార్టీ నాయకుడు చెప్పిన మాటలు పాటిస్తాడని, అదీ.. ఆయన క్యారెక్టర్ అంటూ మండిపడ్డారు.