
వైద్యుడు సుధాకర్ తల్లి వేసిన హేబియస్ కార్పస్ హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం విచారించింది. సుధాకర్ డిశ్చార్జ్‌కి హైకోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐ విచారణకు సహకరించాలని డాక్టర్ సుధాకర్‌కు సూచించింది. విచారణలో పిటీషనర్ తరుపు న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. సుధాకర్ ను అరెస్ట్ చేసినట్లు చూపించకుండా గత నెల 16వ తేదీ నుంచి ఈ రోజు వరకూ విశాఖ పోలీసులు వారి ఆధీనంలో ఉంచుకున్నారని, తనకు వైద్యం అవసరం లేదని పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని సుధాకర్ స్వయంగా లేక రాసినా అధికారులు స్పందించకుండా వారి ఆధీనంలో ఉంచుకున్నారని చెప్పారు.
ఈ అంశంపై ధర్మాసనం పోలీసులను, సిబిఐని ప్రశ్నించింది. వారు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. వాదనలు పూర్తి అయిన అనంతరం హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం సుధాకర్ చికిత్స పొందుతున్న ప్రభుత్వ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్‌కు తెలియజేసి ఎప్పుడైనా డిశ్చార్జ్ కావచ్చని పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల సుధాకర్ తల్లి కావేరీబాయి సంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు సుధాకర్ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. నర్సీపంట్నం చేరుకున్న సీబీఐ అధికారులు స్థానిక మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని విచారించారు. తొలుత సుధాకర్ పనిచేస్తున్న ఆసుపత్రికి వెళ్లి సర్వీసు రికార్డు, హాజరు పట్టికను పరిశీలించారు.ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను సుధాకర్ ప్రవర్తన, తోటి ఉద్యోగులతో ఎలా ఉండేవాడని వివరాలు అడిగి తెలుసుకున్నారు.