
దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజుకు 3 లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ లో రోజూవారీ కేసుల సంఖ్య పది వేలకు చేరింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది ఏపీ సర్కారు. ఈ విషయం హైకోర్టుకు చేరడంతో.. ఇవాళ విచారించిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
కొవిడ్ తో బాధపడుతున్న విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. నిబంధనల ప్రకారం హోం ఐసోలేషన్లో ఉండాలి కదా? అని నిలదీసింది. వారికి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వ న్యాయవాది చెప్పగా.. అదెలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. కొవిడ్ తో బాధపడుతున్న వారు పరీక్షలు రాయగలుతారా? మానసికంగా సిద్ధం అవుతారా? అని ఆగ్రహం వ్యక్తంచేసింది.
ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేయడం.. వాయిదా వేయడం వంటివి చేస్తున్నారని.. ఆ విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు పరీక్షల్లో భాగం కావాల్సి ఉందని, అందువల్ల పరీక్షల విషయంలో ప్రభుత్వం పునఃపరిశీలన చేసుకోవాలని సూచించింది. మే 2 లోగా ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన కోర్టు.. విచారణను 3వ తేదీకి వాయిదా వేసింది.
కాగా.. పొరుగు రాష్ట్రం తెలంగాణలో టెన్త్ పరీక్షలను రద్దు చేశారు. ఈ నిర్ణయం కూడా ఎప్పడో తీసుకున్నారు. ఇంటర్ పరీక్షలను మాత్రం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది టీఎస్ సర్కారు. ఏపీ మాత్రం ఇప్పటికీ పరీక్షలు నిర్వహించేందుకే మొగ్గు చూపుతుండడం గమనార్హం. దాదాపు 30 లక్షల మంది పరీక్షా కేంద్రాలకు నిత్యం వచ్చి వెళ్లాల్సిన పరిస్థితుల్లో.. కొవిడ్ వైరస్ వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.