CM Jagan On Meters: ఉచిత విద్యుత్.. గత 17 ఏళ్లుగా నిర్విగ్నంగా కొనసాగుతున్న పథకం. 2004లో సీఎంగా వైఎస్ రాజశేఖరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఉచిత విద్యుత్ ఫైల్ పై సంతకం చేశారు. అప్పటి నుంచి ఏపీలో ఉచిత విద్యత్ అమలవుతోంది. అసలు పథకాన్ని టచ్ చేసేందుకు కూడా అటు తరువాత వచ్చిన ప్రభుత్వాలు ప్రయత్నించలేదు. కానీ నాడు తండ్రి ప్రవేశపెట్టిన పథకానికి మంగళం పలికేలా జగన్ వ్యవహరిస్తున్నారు. తాజాగా మీటర్ల పేరిట తూట్లు పొడిచేందుకు జగన్ సర్కారు సన్నద్ధమవుతోందన్న ఆందోళన రైతాంగంలో కనిపిస్తోందని వ్యవసాయ సంఘాలు పేర్కొంటున్నాయి. వ్యవసాయానికి పగటి పూట తొమ్మిది గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తామంటూ ప్రభుత్వం అట్టహాసంగా చేసిన ప్రకటనలు దారి తప్పుతున్నాయన్న ఆందోళన రైతాంగంలో వ్యక్తమవుతోంది.
రాష్ట్రంలో 18 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటన్నింటికీ మూడు నెలల కాలవ్యవధిలోనే మీటర్లు బిగించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలోని 29 వేలకు పైగా వ్యవసాయ పంప్‌సెట్లకు తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్) ప్రయోగాత్మకంగా మీటర్లను బిగించింది. దీన్ని రాష్ట్రమంతా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటిదాకా ఉచిత విద్యుత్ పథకం కింద రైతులు వాడిన కరెంటుకు ఏకమొత్తంలో డిస్కమ్‌లకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసేది.కానీ, ఇప్పుడు పంపు సెట్లకు మీటర్లు బిగించి, నెలవారీ రీడింగ్ తీసి బిల్లులను రైతులకు అందజేస్తారు. ఆ బిల్లు మొత్తం రైతు వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో వేస్తామని, అందులోంచి డిస్కమ్‌లు తీసుకుంటాయని ప్రభుత్వం చెబుతుంది. బిల్లులు చెల్లించాలంటూ రైతులపై ఒత్తిడి ఉండదంటోంది. అయితే, ఇదంతా గందరగోళంగా, ఒక మాయామశ్చీంద్రలా ఉందని రైతాంగంలో ఆందోళన కనిపిస్తోంది. అందుకే దీన్ని రైతులు విశ్వసించడం లేదు. ఉన్నపళంగా ఉచిత విద్యుత్ పథకంలో మార్పులెందుకు తీసుకువచ్చారంటూ రైతాంగం ప్రశ్నిస్తోంది.
Also Read: Gulf Countries Ruling India : గల్ఫ్ దేశాలు భారత్ ను శాసిస్తున్నాయా? తలొగ్గుదామా?
విద్యుత్ ఆదా కోసమే..
మరోవైపు వ్యవసాయ కనెక్షన్ల ద్వారా ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారన్న హేతుబద్ధమైన లెక్క కోసమే మీటర్లు బిగిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ప్రతియేటా ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)కి వార్షిక ఆదాయ వ్యయ నివేదిక(ఏఆర్‌ఆర్)ను డిస్కమ్‌లు సమర్పిస్తాయి. ఇందులో ప్రభుత్వం అమలుచేస్తున్న ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకానికి ఏక మొత్తంలో ఎంత సబ్సిడీని చెల్లిస్తుందో స్పష్టం చేస్తుంది. కానీ, ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో డిస్కమ్‌లకు ఈ సబ్సిడీని ప్రభు త్వం అందించాల్సిన అవసరం లేదు. వ్యవసాయ విద్యుత్ పథకానికి గాను రైతుల ఖాతా నుంచి నేరుగా డిస్కమ్‌లు తీసుకుంటాయి. దీనివల్ల ప్రత్యేకంగా ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం కోసం ప్రభుత్వం ఎంత చెల్లించాలో ఏఆర్‌ఆర్‌లో డిస్కమ్‌లు చూపించాల్సిన అవసరం ఉండదు. అంటే సాంకేతికంగా డిస్కమ్‌ల దృష్టిలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకం అమలులో లేనట్లేనని నిపుణులు చెబుతున్నారు.
సిక్కోలులో ప్రయోగాత్మకం..
మీటర్ల బిగింపునకు ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాను ఎంపిక చేశారు. ఇప్పుడు అక్కడ రీడింగ్ తీసి బిల్లులు ఇస్తున్నారు. కరోనా సమయంలో వ్యవసాయ పనులు అంతంత మాత్రంగా సాగడంతో వినియోగం తగ్గిందని చెబుతున్నారు. కానీ, కరోనా ఛాయలు తగ్గి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నందున వ్యవసాయ పనుల్లోనూ వేగం పెరిగింది. ఇప్పుడు ప్రతి నెలా సగటున రూ.100 నుంచి రూ.500 దాకా వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు బిల్లులు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. ఈ బిల్లులకు ప్రభుత్వం డబ్బులు వేస్తుందో లేదో తెలియడం లేదంటున్నారు. ప్రస్తుతం ఒక్క జిల్లాలో తక్కువ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించినా, భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా నెలవారీగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందా అనే అనుమానాలను రైతాంగం లేవనెత్తుతోంది.
Also Read:CM KCR – Governor Tamilisai: కేసీఆర్ తో డైరెక్ట్ ఫైట్ కు రెడీ అయిన గవర్నర్ తమిళిసై