మరో నాలుగైదు రోజులలో ఆర్ధిక సంవత్సరం ముగియనున్న దృష్ట్యా వార్షిక బడ్జెట్ కు ఆమోదింప చేసుకొనే విషయంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి భారీ కసరత్తు చేస్తున్నారు. ఉగాది పూర్తి కాగానే నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి ఓట్ ఆన్ అక్కౌరట్ కు ఆమోదం పొందాలను తొలుత భావించారు.
ఇప్పటికే బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేసుకున్నప్పటికీ దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారితో దిగ్బంధనంలో ఉండడం, ఏపీలో సహితం క్రమంగా కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో ఇటువంటి సమయంలో అసెంబ్లీ సమావేశాలు జరపడానికి వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకనే ఆర్డినెన్సు ద్వారా బడ్జెట్ కు ఆమోదం పొందే ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విషయమై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు న్యాయనిపుణులు సంప్రదిస్తున్నారు.
పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి అనుమతి పొండాలంటే కనీసం 14 రోజులు అవసరం అవుతుంది. బడ్జెట్‌పై చర్చకు ఆరు రోజులు, డిమాండ్లపై చర్చకు ఎనిమిది రోజులు కావాల్సి ఉంటుంది. అందుచేత ప్రస్తుతం పూర్తి స్థాయి బడ్జెట్‌కు అవకాశమే లేదని వారం రోజుల క్రితమే నిర్ణయానికి వచ్చారు.
ఇక ఔట్ ఆన్ అక్కౌరట్ ద్వారా బడ్జెట్‌ను ఆమోదించు కోవాలన్నా కూడా కనీసం నాలుగు రోజులైనా చర్చించవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రవేశపెట్టిన మర్నాడే ఆమోదం తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దీనికోసం కొద్ది గంటలే సభ నిర్వహించి వాయిదా వేసే అవకాశాలు లేకపోలేదని అధికారులు పేర్కొంటున్నారు.
తాజాగా కరోనా విజృరభణ కారణంగా రాజ్యసభ ఎన్నికలను కూడా వాయిదా వేసిన పరిణామాల నేపథ్యంలో శాసనసభ నిర్వహణపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 175 మంది శాసనసభ్యులు, 50 మందికిపైగా మండలి సభ్యులు, వందలాది మంది అధికారులు, సిబ్బంది హాజరు కావాల్సిన పరిస్థితి ఉండడంతో నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఆర్డినెన్స్ అంశం తెరపైకి వస్తున్నది. 2004లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ విధంగా చేసిన సందర్భాన్ని ఈ సందర్భంగా అధికారులు గుర్తు చేస్తున్నారు. 2003 అక్టోబర్ లో అలిపిరి వద్ద చంద్రబాబుపై దాడి జరిగిన వెరటనే ఆయన అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్న నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 14న ఆయన శాసనసభను రద్దు చేశారు.
అయితే ఎన్నికల కమిషన్ మాత్రం పార్లమెంట్ ఎన్నికలతోపాటే రాష్ట్ర శాసనసభ ఎన్నికలను మార్చి నుంచి మే నెలల మధ్యలో నిర్వహించడంతో బడ్జెట్ పై గందరగోళం నెలకొంది. ఆ తరుణంలోనే ఆర్డినెన్స్ ద్వారా ద్రవ్య వినిమయానికి అనుమతి తీసుకున్నారు. తరువాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఆ ఆర్డినెన్స్‌నే శాసనసభలో ప్రవేశపెట్టి అనుమతి పొందడం గమనార్హం.