AP Govt Has Massively Increased The Pole Tax: అగ్గిపుల్లా.. సబ్బుబిల్లా కాదేది జగన్ సర్కార్ పెంచడానికి అనర్హం. ఆఖరుకు చెత్త మీద కూడా పన్ను వేసిన ఘనత మన ‘జగన్ సార్’దే.. అప్పుల కుప్పల్లో కూరుకుపోయిన ఏపీని గట్టెక్కించడానికి ఇప్పుడు ప్రజలపై పన్నుల మోత మోగించడం తప్ప జగన్ కు ఆప్షన్ లేనట్టు ఉంది. అందుకే ఆఖరుకు విద్యుత్ స్తంభాలను కూడా వదలకుండా ‘పన్నుల’ మోత మోగిస్తున్నారు. జగన్ సార్ పన్నుల క్రియేటివిటీకి ఇప్పుడు ప్రజలు, వివిధ వర్గాల వారు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలాంటి వాటిపై కూడా పన్నులు వేయవచ్చా? అని ఆశ్చర్యపోతున్నారు.
ఏపీలో జగన్ సర్కార్ మరో బాదుడుకు సిద్ధమైంది. విద్యుత్ స్తంభంపై కేబుల్ వైర్లు కడితే భారీగా పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థలు ఉత్తర్వులు జారీ చేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.50, మండల కేంద్రాలు, పట్టణాల్లో రూ.75, జిల్లా కేంద్రాలు, నగరాల్లో అయితే రూ.100 వసూలు చేయనున్నారు. ఈ ఉత్తర్వులపై కేబుల్ ఆపరేటర్లు భగ్గుమంటున్నారు. సీఎం జగన్ విపక్ష నేతగా పాదయాత్ర చేసినప్పుడు పోల్ ట్యాక్స్ రద్దు చేస్తానని కేబుల్ ఆపరేటర్లకు హామీ ఇచ్చారు. అసంఘటిత రంగ కార్మికులుగా గుర్తిస్తానని చెప్పుకొచ్చారు. సమస్యల పరిష్కారానికి ఒక అధ్యయన కమిటీ వేస్తానని సైతం హామీ ఇచ్చారు. కానీ మూడేళ్లు గడుస్తున్నా ఈ సమస్యలేవీ పరిష్కరించలేదు. ఇప్పడు ఏకంగా పోల్ ట్యాక్స్ ను భారీగా పెంచడంతో కేబుల్ ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలతో గుంపగుత్తిగా ఓట్లు వేశామని.. ఇప్పుడు తమను మోసం చేశారని వాపోతున్నారు. దాదాపు నాలుగు రెట్లు ట్యాక్స్ పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే కేబుల్ నడపలేమని చెబుతున్నారు.
వాస్తవానికి 2005 వరకూ కేబుల్ వ్యవస్థపై ఎటువంటి పన్నులు వసూలు చేసిన దాఖలాలు లేవు. 2004లో అధికారంలోకి వచ్చిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2005లో పోల్ ట్యాక్స్ వసూలు చేయాలని జీవో జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.15, పట్టణాల్లో రూ.20 వసూలు చేయాలని విద్యుత్ పంపిణీ సంస్థలకు ఆదేశాలిచ్చారు. అటు తరువాత వచ్చిన ప్రభుత్వాలు అదే జీవోలను అమలు చేశాయి. సుమారు 13 ఏళ్ల తరువాత 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో పోల్ ట్యాక్స్ ను స్వల్పంగా పెంచుతూ జీవోలిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.20, పట్టణ ప్రాంతాల్లో రూ.50 వసూలు చేయాలని నిర్ణయించారు. అయితే దీనిపై కేబుల్ ఆపరేటర్లు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీనికి తలొగ్గిన అప్పటి టీడీపీ సర్కారు ఆ జీవోను అమలు చేయకుండా నిలిపివేసింది. వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడున్న రెండు శ్లాబుల విధానానికి కాదని ..మూడు శ్లాబులను నిర్ణయించింది.1. పంచాయతీలు 2. మండలకేంద్రాలు,పట్టణాలు 3. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లుగా విభజించి బాదుడుకు సిద్ధమైంది.
కేబుల్ వ్యవఃస్థ నిరుద్యోగులకు ఉపాధి మార్గంగా నిలిచింది. గ్రామాలు, పట్టణాల్లో కేబుల్ నడుపుతూ వేలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. గతంలో మాదిరిగా కేబుల్ ఆపరేటర్లకు ఇబ్బడిముబ్బడిగా ఆదాయం వచ్చే పరిస్థితులు లేవు. సెటాప్ బాక్సుల రాకతో ఎన్ని కనెక్షన్లు ఉంటాయో.. అందుకు తగ్గట్టు నగదు చెల్లించాల్సిందే. పే చానళ్లకు నిర్థిష్ట మొత్తం వెళ్లిపోతోంది. ఒక్కో కనెక్షన్ కు స్వల్పంగానే మిగులుతోంది. అందులోనే నిర్వహణ ఖర్చులు, సిబ్బంది వేతనాలు ఇచ్చుకోవాలి. ఈ పరిస్థితుల్లో కేబుల్ ఆపరేటర్లను ప్రోత్సహించాల్సింది పోయి నిర్వీర్యం చేసేలా జీవోలు జారీ చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. కేవలం ప్రైవేటురంగ సంస్థలకు మేలు చేకూర్చడానికే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం జీవోలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Petrol Diesel Price Increase: 5 రోజుల్లోనే రూ.3 పెంపు..ఇంకా పెంచుడేనట.. మోడీ సార్ వదలవా?