Jagan- Governor: బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నచోట ఆధిపత్యం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆరోపణలున్నాయి. ఇందుకు గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకుంటుందన్న అపవాదు ఉంది. అందుకు తగ్గట్టుగానే పశ్చిమబెంగాల్, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో గవర్నర్ ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను నియంత్రించాలని బీజేపీ పెద్దలు చూస్తున్నట్టు ఆరోపణలున్నాయి. దానికి తగ్గట్టుగానే చాలా పరిణామాలు ఇటీవల కాలంలో వెలుగుచూశాయి. ఇప్పుడు ఏపీలో కూడా అటువంటి ప్రయత్నమే జరుగుతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. రెండు నెలల కిందట విశ్వభూషణ్ హరిచందన్ అనూహ్య మార్పు కూడా పొలిటికల్ అజెండాగానే సాగిందన్న రూమర్స్ వినిపించాయి. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్ధుల్ నజీర్ ఏపీ గవర్నర్ గా నియమితులయ్యారు.అయితే ఇటీవల ఆయన చర్యలు చర్చనీయాంశమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పనితీరుకు సంబంధించి నెలవారీ నివేదికలు పంపాలని గవర్నర్ కోరినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇది ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇది సాధారణ చర్యేనని ఎవరికి వారు సమర్థించుకుంటున్నా.. దీని వెనుక పొలిటికల్ ప్లాన్ ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.
ఆ ఫిర్యాదులపై స్పందించారా?
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో ఆర్థిక క్రమశిక్షణ కట్టుదాటిందని కేంద్రానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అప్పు చేయనిదే ప్రభుత్వానికి గడవదన్న రీతిలో వ్యవహారం నడుస్తోంది. చివరకు పాలనలో భాగస్వామ్యమైన ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని స్టేజ్ లో ఏపీ సర్కారు ఉంది. ఏపీలో ఆర్ధిక పరిస్ధితితో పాటు సంక్షేమ పథకాల అమలు, అప్పుల సేకరణ వంటి విషయాల్లో అధికార, విపక్షాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం, కాగ్ చెప్పే లెక్కలతో జగన్ సర్కార్ లెక్కలు సరిపోలడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అప్పుల పరిమితి పెంచాలన్నా, ఏపీకి సంబంధించి ఇతర కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నా, అలాగే ఏపీ ప్రభుత్వం పనితీరు తప్పుబట్టాలన్నా కేంద్రానికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇటువంటి తరుణంలో గవర్నర్ ఏ నెలకు ఆ నెల లెక్కలు అడుగుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రొగ్రెస్ రిపోర్టు అడిగిన గవర్నర్..
అధికార, విపక్షాలు అన్నాక ఒకరినొకరు ఇరుకున పెట్టుకోవడం సహజం. కానీ ప్రభుత్వ వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు ఇప్పుడు గవర్నర్ ప్రొగ్రెస్ రిపోర్టు అడగడం మాత్రం కొత్తగా ఉంది. పాలనలో ఇది సహజమే అయినా ఏపీలో గత నాలుగు సంవత్సరాలుగా లేనిది కొత్తగా లెక్కలు అడుగుతుండడంతో ఇదో రాజకీయ అంశంగా మారిపోయింది. ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖకు గవర్నర్ లేఖ రాసినట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్లు వివరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా సిద్ధపడుతోంది. కానీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, రాజకీయ పరిణామాలు మారుతున్న సమయంలో గవర్నర్ ఎంట్రీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి అయిన జస్టిస్ అబ్ధుల్ నజీర్ ను గవర్నర్ గా ఎంపిక చేయడం, తొలి పోస్టింగ్ ఏపీకి కేటాయించడంపై రకరకాల వ్యాఖ్యలు వినిపించాయి. జగన్ సర్కారు చర్యలకు అడ్డుకట్ట వేసేందుకేనన్న ప్రచారం సాగింది. కానీ తొలి రెండు నెలల్లో ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించిన గవర్నర్ ఇప్పుడు ప్రత్యేకంగా ఫోకస్ చేయడం మాత్రం ప్రభుత్వ పెద్దలకు రుచించడం లేదని తెలుస్తోంది.
కేంద్రం హస్తం ఉందా?
ప్రస్తుతం బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు పెద్ద ఫైట్ చేస్తున్నారు. ఇలాంటి నివేదికల పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలకు ముప్పుతిప్పలు పెడుతున్నారు. పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణలో సైతం ప్రభుత్వానికి గవర్నర్ కు గ్యాప్ ఉంది. ఇతరత్రా రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు అటువంటి గేమ్ ఏపీలో మొదలుపెట్టారా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒక వేళ కేంద్రం ఆదేశాల మేరకు గవర్నర్ ఈ విధంగా చేస్తున్నారా? అన్న అనుమానం సైతం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అయితే ఇక్కడి నుంచి గవర్నర్, ప్రభుత్వం మధ్య జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలు, గవర్నర్ వ్యవహరించే తీరుపై ఇది తేటతెల్లం కానుంది. అంతవరకూ వెయిట్ చేసే ధోరణిలో వైసీపీ సర్కారు ఉంది.