Movie Tickets Online : టాలీవుడ్ వర్గాలు ఎంత వ్యతిరేకించినా.. టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం కల్పించాలని మొత్తుకున్నా వినని జగన్ సర్కార్ తాజాగా అన్నంత పని చేసింది. సినిమా టికెట్లను ఆన్ లైన్ లో అమ్మాలని డిసైడ్ అయ్యింది. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అమ్మడానికి రంగం సిద్ధం చేసింది. థియేటర్లు కూడా అమ్మడానికి లేదని జీవో జారీ చేసింది.
ఏపీ ప్రబుత్వం అమ్మడం ఇష్టం లేకనే ఆన్ లైన్ టికెటింగ్ సంస్థను ఎంపిక చేసేందుకు టెండర్లు పిలిచింది. అల్లు అరవింద్ కుమారుడికి చెందిన సంస్థ ఎల్1గా నిలిచిందని.. కాంట్రాక్ట్ కట్టబెట్టడం ఖాయమని తేలింది.అయితే రెండు నెలలుగా దీన్ని హోల్డ్ పెట్టిన ఏపీ ప్రభుత్వం సడెన్ గా షాకిచ్చింది. తాజాగా ఆన్ లైన్ టికెటింగ్ గురించి మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటికే ఉన్న ఆన్ లైన్ టికెటింగ్ బుకింగ్ సంస్థలు కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చని అందులో పేర్కొన్నారు. ప్రతి టిక్కెట్ పై ప్రభుత్వానికి 2 శాతం కమీషన్ ఇవ్వాలని ఆదేశించి ట్విస్ట్ ఇచ్చింది. దీంతోపాటు మరికొన్ని రూల్స్ జత చేసింది. కోట్లు కొల్లగొట్టే సినిమాపై ప్రతీ టికెట్ కు కమీషన్ వసూలు చేసి లబ్ధి పొందడమే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
సినిమా టికెట్లు ఆన్ లైన్ చేయడంతో ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్ల వద్ద టికెట్లు అమ్మరాదని ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఎవరైనా సినిమా చూసేందుకు థియేటర్ కు వచ్చి టికెట్ తీసుకుందామంటే దొరకడం కష్టమే. అందరికీ ఆన్ లైన్ లో బుక్ చేసుకోవడం కష్టం కాబట్టి ఈ విధానం ఎంతమేరకు సత్ఫలితాలు ఇస్తాయన్నది వేచిచూడాలి.
థియేటర్ల వద్ద టికెట్లు అమ్మినా ఆన్ లైన్ పద్ధతిలోనే అమ్మాల్సి ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. టికెటింగ్ ఏజెన్సీ ద్వారా మాత్రమే టికెట్లు అమ్మాలి. అలా చేయడం వల్ల గెట్ వే ఛార్జీలు.. అదనంగా ప్రభుత్వం కమీషన్ అన్నీ కలిపి ప్రేక్షకుడే చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రేక్షకుడిపైనే అధిక భారం పడనుంది.
ప్రభుత్వమే ఆన్ లైన్ టికెటింగ్ ఫ్లాట్ ఫాం వెబ్ సైట్ ఓపెన్ చేసి నిర్వహించి 2 శాతం కమీషన్ చెల్లించాలని నిబంధన పెట్టడం విచిత్రంగా ఉంది. దీనివల్ల ఆన్ లైన్ టికెటింగ్ సంస్థలు, ఏపీ ప్రభుత్వం కూడా పీల్చి పిప్పి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.