Janasena: లక్షలాది మంది రోడ్డున పడితే ప్రభుత్వం చోద్యం చూస్తోంది : నాదెండ్ల

– నాదెండ్ల మనోహర్(Nadendla Manohar)  ముఖాముఖి పని చేయాలన్న మనస్తత్వంతో కష్టపడతాం అన్నవారికి పని లేకపోవడం బాధాకరమని.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని జనసేన(Janasena) పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్  నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రెక్కల కష్టం మీద ఆధారపడి బతికే భవన నిర్మాణ కార్మికులకు గత రెండేళ్ల నుంచి సక్రమంగా ఉపాధి దొరకడం లేదు.. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడినా ఈ ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. ఈ […]

Written By: NARESH, Updated On : August 28, 2021 12:42 pm
Follow us on

– నాదెండ్ల మనోహర్(Nadendla Manohar)  ముఖాముఖి

పని చేయాలన్న మనస్తత్వంతో కష్టపడతాం అన్నవారికి పని లేకపోవడం బాధాకరమని.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని జనసేన(Janasena) పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్  నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రెక్కల కష్టం మీద ఆధారపడి బతికే భవన నిర్మాణ కార్మికులకు గత రెండేళ్ల నుంచి సక్రమంగా ఉపాధి దొరకడం లేదు.. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడినా ఈ ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. ఈ సమస్యలన్నింటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే కారణమని తెలిపారు. కృత్రిమ ఇసుక కొరత సృష్టించి దోచుకుంటున్నారన్నారు. శనివారం ఉదయం విజయవాడ బెంజ్ సర్కిల్ లోని కూలీల అడ్డా దగ్గర భవన నిర్మాణ కార్మికులతో ముఖాముఖి చర్చించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

అడ్డా మీదే టీ బండి వద్ద కూలీలతో కలసి టీ తాగుతూ సుమారు 40 నిమిషాలతోపాటు చర్చించారు. అనంతరం  నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. “ఈ ప్రభుత్వ విధానాలకు ఒకప్పుడు తాపీ మేస్త్రీలుగా ఉన్న వారు కూలీలుగా మారిపోయారు. చదువుకున్న వారు అటు ఉద్యోగాలు లేక కూలి పనులకు వెళ్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితులున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువవడం బాధాకరం.

ఇసుక కొరత సృష్టించి కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. రాష్ట్రంలో కొంత మందికి మాత్రమే ఇసుక దొరుకుతున్న పరిస్థితి. భవన నిర్మాణ కార్మికుల కష్టాలు చూసి ఏడాదిన్నర క్రితం   పవన్ కళ్యాణ్(pawan kalyan) విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించారు.

* రూ.3 వేల కోట్ల నిధులు ఏం చేశారు?

విశాఖ లాంగ్ మార్చ్ తర్వాత మూడు పాలసీలు తీసుకువచ్చారు. ఇప్పటికీ స్పష్టత లేదు. ప్రయివేటు వ్యాపారులకు ఇసుక కాంట్రాక్టులు ఇచ్చి మరీ దోచుకుంటున్నారు. లక్షలాది మంది రోడ్డునపడ్డారు. వారందరికీ న్యాయం జరగాలి. వారి సమస్యల పరిష్కారానికి భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ ఫండ్ నుంచి ఖర్చు చేయాలి. సుమారు రూ. 3 వేల కోట్ల ఫండ్ ఉంది.. ఆ ఫండ్ వినియోగించాలి. భవన నిర్మాణ కార్మికుల  హెల్త్ క్లైమ్స్ కు సంబంధించి ఇప్పటికీ లక్షా పాతిక వేల అప్లికేషన్లు పెండింగ్లో పెట్టారు. వారికి అందాల్సిన లబ్ధి కూడా దక్కడం లేదు.

  • జనసేన ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్

అడ్డా మీద కూలీలకు ఆరోగ్య సమస్యలు ఉన్న విషయం మా దృష్టికి వచ్చింది. జనసేన పార్టీ డాక్టర్స్ సెల్ తరఫున ఆదివారం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వారికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించి మందులు కూడా అందించే ఏర్పాటు చేస్తాం. మరుగుదొడ్లు, నీటి వసతి అడుగుతున్నారు. అధికారులతో సంప్రదించి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తనఫున వారికి పొర్టబుల్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తాం” అని అన్నారు.

  • రెండేళ్ల పాలనలో మా బతుకులు కూలిపోయాయి

అంతకు ముందు  నాదెండ్ల మనోహర్ తో అడ్డా కూలీలు తమ సమస్యలు చెప్పుకొన్నారు. “బెంజి సర్కిల్ వద్దకు నిత్యం 400 మందికి పైగా పని కోసం వస్తుంటే 25 శాతం మందికి కూడా పని దొరకడం లేదు. పనుల కోసం మధ్యాహ్నం వరకు వేచి చూసినా ఫలితం ఉండడం లేదు. ఈ అడ్డా వద్ద మహిళల పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉంది. కనీసం మరుగుదొడ్లు కూడా లేక ఇబ్బంది పడుతున్నాం. పని లేకపోతే ఆ రోజుకి మధ్యాహ్నం ఎవరైనా దాతలు పెట్టే అన్నమే మాకు గతి. ఇసుక అందుబాటులో లేక ఇప్పటికీ పనులు దొరకడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు మా ఓటు మాత్రమే కావాలి. మా ఇబ్బందులు మాత్రం వారికి అవసరం లేదు. పేదల ఇళ్ల పథకంలో కూడా మాకు అన్యాయం జరిగింది. ఇళ్లు ఉన్న వారికే మళ్లీ ఇళ్లు ఇచ్చారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉన్నా ఇవ్వడం లేదు. 50 ఏళ్ల క్రితం జరిగిన మ్యారేజ్ సర్టిఫికెట్ తెమ్మని అడుగుతున్నారు. స్థలాలు వచ్చిన వారిని ముందుగా మీరు ఇల్లు కట్టుకుంటే బిల్లు ఇస్తామంటున్నారు. భవన నిర్మాణ కార్మికుల డబ్బు తినేశారు. రెండేళ్ల పాలనలో మా బతుకులు కూలిపోయాయి” అంటూ తమ సమస్యలు చెప్పుకుని వాపోయారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ పెదపూడి విజయ్ కుమార్, చేనేత వికాస విభాగం చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కన్వీనర్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, పార్టీ నాయకులు శ్రీ మండలి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

  • పామర్రులో ఘన స్వాగతం

విజయవాడ నుంచి పెడన పర్యటనకు వెళ్తుండగా మార్గమధ్యంలో పామర్రు వద్ద   తాడిశెట్టి నరేష్ ఆధ్వర్యంలో జనసేన శ్రేణులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ఘనస్వాగతం పలికారు. గజమాల వేసి పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో   నాదెండ్ల మనోహర్ గారు కాసేపు ముచ్చటించారు.