ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్-1 సహా అన్ని పరీక్షల ఇంటర్వ్యూలు రద్దు చేస్తూ రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు ఇంటర్వ్యూలు ఉండవంటూ సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
గ్రూప్-1 సహా అన్ని పరీక్షల ఇంటర్వ్యూలు రద్దు చేయడం నిజంగా గొప్ప నిర్ణయంగానే అభివర్ణిస్తున్నారు. ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు ఇంటర్వ్యూలు లేకపోవడం ఆహ్వానించదగ్గ విషయమే. ఉద్యోగాల ఎంపికలో ఇకపై ఇంటర్వ్యూలు ఉండబోవని చెప్పారు. పోటీ పరీక్షల్లో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శశిభూషణ్ పేర్కొన్నారు.
ఉత్తర్వులు వెలువడిన రోజు నుంచే ఆదేశాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఇంటర్వ్యూలు లేకుండా గ్రూప్ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఎంపిక ప్రక్రియ ఎలా ఉండబోతోందనే దానిపై స్పష్టత ఇస్తామన్నారు.
ఇటీవల ఏపీ ప్రభుత్వం 2021-22 సంవత్సరానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఇందులో ఉద్యోగాల సమాచారంపై సమగ్ర సమాచారం ఇచ్చారు. ఏపీలో 10,143 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని భావించారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ ఉపయోగపడుతుందని చెప్పారు. రాష్ర్టంలో ఉద్యోగాల భర్తీకి అవకాశం ఉన్న పోలీస్, విద్య, వైద్య శాఖల్లో పోస్టుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.