AP Global Summit : విశాఖ వేదికగా జరిగిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జగన్ సర్కారు ఊహించిన దాని కంటే సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇదంతా ఒక ఎత్తైతే ముకేష్ అంబానీ ఏపీ సీఎం జగన్ కు ఎనలేని ప్రాధాన్యం ఇవ్వడం కూడా జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. స్వయంగా ముకేష్ హాజరుకావడమే కాకుండా సమ్మిట్ నిర్వాహకుడిగా మారి అన్నీతానై వ్యవహరించారు. సీఎం జగన్ తో చాలా క్లోజ్ గా గడిపారు. ఇప్పుడు ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై పెద్దఎత్తున మైలేజీ వస్తుండడంతో వైసీపీ సోషల్ మీడియా విభాగం కూడా అదే పనిగా వాటిని ట్రోల్ చేస్తున్నాయి. అనుకూలమైన పోస్టులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నాయి.
అయితే సమ్మిట్ కు ముకేష్ అంబానీతో పాటు దిగ్గజ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. కరణ్ అదానీ, జిఎమ్మార్, పునీత్ దాల్మియా, ప్రీతారెడ్డి, సజ్జన్ భజాంక్, హరిమోహన్ బంగూర్, జిందాల్, నవీన్ మిట్టల్, మోహన్ రెడ్డి, డాక్టర్ కృష్ణా ఎల్లా, కుమార మంగళం బిర్లా వంటివారు స్వయంగా తరలివచ్చారు. ఇంతమంది ప్రముఖులు ఒకేరోజు ఒకేసారి ఒకే వేదిక పంచుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కానేకాదు. కానీ వీరందరిలో ముకేష్ అంబానీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దిగ్గజ పారిశ్రామిక వేత్తలు రావడానికి, వారిని సమీకరించడానికి అంబానీయే కారణమన్న టాక్ వినిపిస్తోంది. తాను రావడమే కాకుండా 14 మంది డైరెక్టర్లను ప్రత్యేక విమానంలో వెంటబెట్టుకొని మరీ వచ్చారు. జగన్ తో ఎంతో సన్నిహితంగా మెలిగారు. ఇప్పుడు సమ్మిట్ ముగిసినా అదే చర్చ మాత్రం కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే సమ్మిట్ లకు అంబానీ హాజరుకావడం చాలా అరుదైన విషయం. అటువంటిది ప్రత్యేకంగా ఏపీకి రావడం మాత్రంపై పెద్ద చర్చే నడుస్తోంది.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముకేష్ అంబానీ ఆసక్తి చూపారు. కానీ చంద్రబాబు నుంచి ఆశించినంత ఆదరణ దక్కలేదు. అందుకే నాడు చంద్రబాబు వరుసగా మూడేళ్ల పాటు సీఐఐ సదస్సులు నిర్వహించినా అంబానీ హాజరుకాలేదు. చాలారకాలుగా పరిశ్రమల విస్తరణకు ఏపీలో అవకాశం ఉన్నా నాడు చంద్రబాబు తనకు చాన్సివ్వలేదన్న అసంతృప్తి ముకేష్ అంబానీలో నెలకొంది. అదే జగన్ కు దగ్గర చేసింది. తనకు కావాలసిన పరిమళ నత్వానికి రాజ్యసభ సీటు ఇప్పించేందుకు ప్రత్యేక విమానం కట్టుకొని మరీ అంబానీ తాడేపల్లి విచ్చేశారు. జగన్ ఎదురొచ్చి ఆహ్వానం అందించారు. అతిథి మర్యాదలతో ముంచెత్తారు. అడిగిందే తడువు రాజ్యసభ తీసుకోండి అంటూ అంబానీకి అగ్రతాంబూలం ఇచ్చారు. దీంతో జగన్ రాచ మర్యాదలను గుర్తుపెట్టుకొని మరీ అంబానీ సమ్మిట్ కు మందీ మార్బలంతో దిగారు.
అయితే అంబానీ రావడానికి భారీ స్కెచ్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అనుకూలమైన ప్రభుత్వం ఉండడంతో ఇప్పుడు ఎంట్రీ ఇస్తే చాలా తేలికగా ఉంటుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా విశాఖ నుంచే తన వ్యాపార విస్తరణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విశాఖ జిల్లా పరవాడలో భారీ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటుకు జగన్ సర్కారు కసరత్తు చేస్తోంది. అంబానీ అడిగిందే తడువుగా ఏ రంగంలోనైనా ప్రోత్సహించడానికి జగన్ సిద్ధంగా ఉన్నారు. అందుకే ఈ సదస్సు ద్వారా ఆ ప్రయత్నాలను ముఖేష్ మొదలుపెట్టారు. అటు జగన్ కు కావాల్సింది అదే. పెట్టుబడులు ఆకర్షించే క్రమంలో ముఖేష్ అంబాని వంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు సైతం ఏరికోరి ఏపీ వస్తున్నారని ప్రచారం కల్పించి రాజకీయంగా మైలేజ్ తెచ్చుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నారు. ఈ తరుణంలో అంబానీ విశాఖ సదస్సుకు వచ్చి మెప్పించారు. ఏకంగా 50 వేల కోట్ల పెట్టబడులు పెడుతున్నట్టు ప్రకటించారు. అటు జగన్ కు, ఇటు అంబానీకి ఉభయ తారకంగా ఉండడంతో వారి మధ్య బంధాలు మరింత బలపడుతున్నాయి.
అయితే అంబానీ వంటి బిగ్ షాట్ ఏపీకి రావడంతో జగన్ ఇమేజ్ మరింత పెరిగింది. నాడు రాజ్యసభ సీటు కేటాయించిన విషయంలో రాజకీయ దుమారం రేగింది. ఏకంగా ఎంపీ సీటును అమ్ముకున్నారని విపక్షాలు ఆరోపణలు చేశాయి. అయితే అందులో వాస్తవం ఎంత ఉందో చెప్పలేం కానీ.. నాడు జగన్ చేసిన పని ఇప్పుడు తనతో పాటు రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చిందన్న టాక్ ప్రజల్లో విస్తరించడానికి వైసీపీ సోషల్ మీడియా ప్రయత్నిస్తోంది. నాడు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినా చంద్రబాబు అడ్డుకున్నారని.. కానీ జగన్ ముందుచూపుతో వ్యవహరించారని ఊరూ వాడా ప్రచారం చేయడం ప్రారంభించారు.