
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం సంగతి అటుంచితే.. కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దీనస్థితిలో ఉంది. ఈ నెల జీతాలు పదో తారీఖుదాకా సర్దు బాటు చేస్తూ వచ్చారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అయితే.. చూస్తుండగానే 20వ తేదీ దాటిపోయింది. దీంతో.. మళ్లీ వేతన కష్టాలు మొదలయ్యాయి. దీంతో.. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మళ్లీ విజయవాడ టూ ఢిల్లీ అప్ అండ్ డౌన్ చేస్తున్నారు..!
రాష్ట్ర అవసరాల కోసం ప్రతీ మంగళవారం బాండ్ల వేలం ద్వారా రిజర్వు బ్యాంకు నుంచి 2 వేల కోట్ల రూపాయల అప్పును ఏపీ తీసుకుంటోంది. ఈ నెలలో చెల్లించాల్సిన జీతాలకు సంబంధించిన అప్పు సకాలంలో అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడింది. మొదటి వారం దాటిపోయిన తర్వాత కూడా చాలా మందికి వేతనాలు జమకాలేదు. దీంతో.. ఉద్యోగులు, పెన్షనర్లు చాలా అవస్థలు పడ్డారు. ఇప్పుడు మళ్లీ నెలాఖరు రాబోతుండడంతో.. మళ్లీ జీతాల వేట మొదలైంది.
ప్రతి నెలా ఒకటో తేదీనాటికి పదివేల కోట్ల వరకు ఏపీ సర్కారుకు అవసరం పడుతున్నాయి. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అప్పుల వడ్డీలు, రుణాల చెల్లింపులు వంటి వాటికోసం ఈ మాత్రం అవసరాలు పడుతున్నాయి. కానీ.. ఆర్బీఐ వద్ద బాండ్ల వేలం ద్వారా ప్రతీ మంగళవారం 2 వేల కోట్ల అప్పు తీసుకుంటున్నప్పటికీ.. అవి సరిపోవట్లేదు. పైగా.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే రుణాలు ఎక్కువగా తీసుకున్నారని చెప్పి.. రుణ పరిమితిని తగ్గించేసింది. దీంతో.. ఏపీ కష్టాలు మరింతగా పెరిగాయి.
అయితే.. ఆర్బీఐ బాండ్ల వేలం ద్వారా తీసుకునే రుణ మొత్తాన్ని డిసెంబర్ వరకూ కొంత మొత్తం.. ఆ తర్వాత మరికొంత మొత్తం తీసుకునేందుకు అనుమతిస్తుంది. అయితే.. డిసెంబర్ వరకు తీసుకునే రుణాన్ని ఏపీ ఇప్పటికే తీసేసుకుంది. దీంతో.. డిసెంబర్ తర్వాత ఇవ్వాల్సిన అప్పు కూడా ఇప్పుడే ఇవ్వాలని కోరుతోందట ఏపీ. ఇందుకోసమే బుగ్గన ఢిల్లీ టూర్ల మీద టూర్లు వేస్తున్నారని చెబుతున్నారు. కనీసం మీడియా కూడా సమాచారం ఇవ్వకుండా వెళ్లివస్తున్నారట. మరి, ఈ నెల ఏం జరుగుతుంది? అసలు ఈ పరిస్థితి ఎప్పుడు తొలగిపోతుంది అన్నది చూడాలి.