AP employees strike : అనుకున్నట్టే అయ్యింది. ఏపీ ఉద్యోగులు ‘తగ్గేదేలే ’ అన్నారు. సమ్మెకు తేదీ ని కూడా ప్రకటించారు. ఉద్యోగులు సమ్మెకు రెడీ అవుతున్నారని కేబినెట్ భేటిని పెట్టి మరీ ‘పీఆర్సీ’ జీవోల అమలుకు ఆమోదముద్రవేసినా కూడా ఉద్యోగులు వెనక్కి తగ్గలేదు. వెంటనే ప్రకటించాల్సిందేనంటూ సమ్మె తేదీ ప్రకటించారు. దీంతో ఏపీలో సమ్మె సైరెన్ మోగింది.
ఫిబ్రవరి 7 నుంచి సమ్మెకు వెళ్లాలని ఏపీ ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ పీఆర్సీ సాధన సమితి సమావేశమైంది. ఫిబ్రవరి 5 నుంచి సహాయ నిరాకరణ మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యింది. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ ‘పీఆర్సీ సాధన సమితి’ సమ్మెకు మొగ్గు చూపింది. ఈనెల 24న సమ్మె నోటీసు ఇవ్వాలని తీర్మానించాయి. ఈరోజు సీఎస్ సమీర్ శర్మను కలిసి పాత జీతాలే ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరనున్నాయి.
-ఉద్యోగుల ఉద్యమ బాట..
-23న అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు
-25న ర్యాలీలు, ధర్నాలు
-26న అన్ని తాలూకా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు.
-ఫిబ్రవరి 3న చలో విజయవాడ
ఇక ఉద్యోగులకే కాదు.. ప్రభుత్వంలోని ఐఏఎస్ లు, ఇతర నామినేటెడ్ పోస్టుల్లోని వారికి కూడా ఈ నెల జీతాలు అందవు. ఎందుకంటే ట్రెజరీ ఉద్యోగులు కూడా పీఆర్సీ ఉద్యమంలో పాల్గొంటున్నామని స్పష్టం చేశారు. వేతన బిల్లులు ప్రాసెస్ చేయలేమని.. పే అండ్అకౌంట్స్ ఉద్యోగుల సంఘం లేఖ రాసింది.
మరోవైపు ఏపీ ఉద్యోగులు సమ్మెకు రెడీ అవుతున్నవేళ సీఎం జగన్ అత్యవసర కేబినెట్ మీటింగ్ పెట్టి పీఆర్సీ జీవోలను యథాతథంగా అమలు చేయాలని ఆమోదింపచేశారు. దీంతో పాటు ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచారు. కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
అయితే ఇన్ని ప్రకటించినా పీఆర్సీ జీతాల విషయంలో ఉద్యోగులు వెనక్కి తగ్గలేదు. సమ్మెకే మొగ్గుచూపారు. దీంతో ఏపీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది? ఎలాంటి చర్యలు చేపడుతుందన్నది వేచిచూడాలి.