AP Employees PRC : ఏ విషయంలోనూ తగ్గేదే లే అన్నట్టుగా జగన్ సర్కార్ వ్యవహరిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలోనూ పేచీ పెడుతోంది. వారి పీఆర్సీ సహా ఉద్యోగ సమస్యల పరిష్కారంలో జాప్యంచేస్తోంది. ఇప్పటికే జగన్ తో పెట్టుకున్న వారికి ఏ గతి పట్టిందో తెలిసిన ఉద్యోగులు కాస్త మిన్నకున్నారు. కానీ వారి కోరికలు నెరవేరేలా కనిపించకపోవడంతో ఇక పోరుబాటకు శ్రీకారం చుట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ నుంచే దీన్ని షురూ చేయాలని డిసైడ్ అయ్యారు.
ఏపీలో పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సరైన ఫిట్మెంట్ తో పాటు తమ డిమాండ్లను తీర్చాలని గత కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్నారు. అయితే ప్రభుత్వం పీఆర్సీపై సమావేశాలు నిర్వహించి సరైన నిర్ణయం తీసుకుంటామని చెబుతోంది. కానీ ఒట్టి మాటలతోనే కాలయాపన చేస్తున్నారని, పీఆర్సీపై సరైన నిర్ణయం తీసుకోవడం లేదని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కేవలం నిరసన ద్వారా తమ డిమాండ్లను తెలిపిన ఉద్యోగులు ఇక పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నాయి. వచ్చే సంక్రాంతి సందర్భంగా అప్పటి వరకు వేచి చూసి ఆ తరువాత ప్రభుత్వాన్ని నిలదీయాలని సమాయత్తమవుతున్నారు.
జగన్ ఎన్నికలకు రాకముందు పాదయాత్రలో కొందరు ఉద్యోగులు కలిసి తమ బాధలను వివరించారు. దీంతో తమ ప్రభుత్వం వస్తే అత్యధిక సంతృప్తి కలిగేలా పీఆర్సీ ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులను జగన్ పట్టించుకోలేదు. న్యాయం చేస్తామంటూ కాలయాపన చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గత నెల రోజుల కిందట ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వంతో చర్చలు జరిపినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో తాము కోరిన డిమాండ్లను పరిష్కరించాలంటున్నారు.
అయితే ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నా స్పష్టత రాకపోవడంతో ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే సచివాలయ ఉద్యోగులు మాత్రం ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని, కాస్త సంయమనం పాటించాలని అంటున్నారు. ఇలా ఉద్యోగ సంఘాలు రెండు వర్గాలుగా విడిపోవడంతో ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు ఒక్కటి కావాలని సూచించింది. అయితే తమ పీఆర్సీపై స్పష్టమైన ప్రకటన ఇస్తే చాలని ఉద్యోగులు అంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఆ దిశగా వెళ్లడం లేదు.
దీంతో సంక్రాంతి తరువాత దశల వారీగా ఆందోళనలు చేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించినట్లు సమాచారం. చర్చల పేరిట ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, ఇప్పట్లో సరైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపించడం లేదని తెలుస్తోంది. అయితే చీఫ్ సెక్రటరీతో చర్చల సందర్భంగా నల్ల బ్యాడ్జిలు ధరించాలని అనుకున్నారు. కానీ ఆ తరువాత నల్ల బ్యాడ్జిలను ధరించడం విరమించుకున్నారు. అయితే త్వరలో ముఖ్యమంత్రితో చర్చలు ఉంటాయని, అక్కడకు నల్ల బ్యాడ్జిలు ధరించి వెళ్లడం మంచిది కాదని సీఎస్ సూచించినట్లు సమాచారం.
Also Read: అమరావతి ఉద్యమానికి చెక్ చెప్పే జగన్ కొత్త వ్యూహం
కానీ ప్రభుత్వం తీరు చూస్తేంటే ఉద్యోగుల ఆందోళనను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. పీఆర్సీతో పాటు 70 డిమాండ్లను కూడా ప్రభుత్వం పక్కనబెట్టిందని ఉద్యోగ సంఘాలు సీరియస్ గా తీసుకున్నాయి. దీంతో ఈనెల 9వ తేదీ తరువాత తిరిగి ఉద్యమించాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా చలో విజయవాడకు కూడా ప్లాన్ చేశాయి. అలాగే ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా ఇబ్బందులు గురవుతున్న నేపథ్యంలో ఆ తరువాత నిరంతర ఉద్యమాలు చేపట్టాలని చూస్తున్నాయి. అయితే అప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని నిర్ణయించాయి. అయితే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందోనని ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం పీఆర్సీ విషయంలో 27 శాతం పిట్ మెంట్ నిర్ణయం తీసుకుందని కొందరు చెబుతున్నారు. కానీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన తరువాత తీసుకుంటే మంచిదని అంటున్నారు. మొత్తంగా సంక్రాంతి తరువాత ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్దమవుతున్నారు. మరి ఈ విషయంలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Also Read: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ పై అందరిలో ఉత్కంఠ?