ఆంధ్ర ప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థ పనితీరును రాష్ట్ర హైకోర్టు కడిగిపారవేసింది. ఈ విషయమై వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ హైకోర్టు లో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. దాదాపు రోజంతా హైకర్టులో గడపవలసి వచ్చింది. రాష్ట్ర చరిత్రలో బహుశా మొదటిసారిగా ఒక డిజిపి ఈ విధంగా నేరుగా హైకోర్టు నుండి దాదాపు `అభిశంసన’ను ఎదుర్కొన్నారు.
విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అరెస్ట్, అమరావతిలో ఉద్యమిస్తున్న మహిళలపై పోలీసులు ప్రదర్శిస్తున్న తీరుపై డిజిపి సంజాయిషీ ఇచ్చుకోవలసి వచ్చింది. ప్రభుత్వం నిరంతరం ఉండేదని, దీని విషయంలో రాజకీయాలు, పార్టీలు ఉండకూడదని, ఈ విషయాన్ని గుర్తెరిగి విధులు నిర్వహించాలని హైకోర్టు హితవు చెప్పింది. పోలీస్ అధిపతిగా పరిస్థితులు సజావుగా ఉండేలా చేయాలని స్పష్టం చేసింది. చట్ట ప్రకారమే విధుల్ని నిర్వహిస్తామని హైకోర్టుకు హామీ ఇచ్చి డిజిపి బైట పడ్డారు.
`రాష్ట్రంలో పోలీసు పాలనేమైనా నడుస్తోందా?’ అంటూ ఏపీ హై కోర్ట్ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ను నిలదీసింది. చట్టబద్ధంగా పాలన సాగించే పద్ధతి ఇదేనా? అసలు నేర శిక్షా స్మృతి (సిఆర్‌పిసి)లోని సెక్షన్ 151 ఏం చెబుతోందో మీకు తెలుసా? ఇలా వరుస ప్రశ్నల వర్షం కురిపించింది.
విశాఖ జిల్లాలో ప్రజా చైతన్య యాత్ర చేపట్టేందుకు ఇటీవల వెళ్లిన ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ తాడికొండ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ దాఖలు చేసిన కేసులో చీఫ్ జస్టిస్ జికె మహేశ్వరి, న్యాయమూర్తులు ఎవి శేషసాయి, సత్యనారాయణ మూర్తిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ పిల్‌ను గతంలో విచారించిన హైకోర్టు.. విచారణకు స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని డిజిపిని ఆదేశించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ధర్మాసనం ఎదుట ఆయన బుధవారం హాజరయ్యారు. ఉదయం పదిన్నర గంటలకే హైకోర్టుకు వచ్చిన డిజిపి సాయంత్రం 4.30 గంటల వరకూ ఉండిపోయారు. పలు ప్రశ్నలతో డిజిపిని ధర్మాసనం ఉక్కిరిబిక్కిరి చేసింది.
అనుమతి తీసుకుని చంద్రబాబు విశాఖ జిల్లాలో ప్రజాచైతన్య యాత్రకు వెళితే ఆయనను అడ్డుకున్న వాళ్లను కాకుండా అనుమతి తీసుకున్న వాళ్లను అరెస్ట్ చేయడ మేమిటి? చట్ట ప్రకారం పాలన సాగేలా, న్యాయబద్ధంగా జరిగేలా కఠిన చర్యలు తీసుకోవాలని డిజిపి గౌతం సవాంగ్‌కు గట్టిగా చెప్పింది.
చంద్రబాబు ఇతరులను సిఆర్‌పిసిలోని 151 సెక్షన్ కింద నోటీసు ఇచ్చి ఎలా అరెస్ట్ చేస్తారని నిలదీసింది. పోలీసుల తీరును ఉపేక్షించబోమని తేల్చి చెప్పింది. ఇలాగే వైఖరి ఉంటే తాము జోక్యం చేసుకోవాల్సివస్తుందని హెచ్చరించింది.
సిఆర్‌పిసిలోని సెక్షన్ 151 ఏం చెబుతోందో చూసి చెప్పాలని డిజిపిని హైకోర్టు ప్రశ్నించింది.
అది కింది స్థాయి పోలీసులు ఇచ్చిన నోటీసు అని, చంద్రబాబు రక్షణకు అన్ని చర్యలు తీసుకున్నామని డిజిపి జవాబు చెప్పారు. 151 నోటీసు ఇవ్వడం సబబు కాదని అంగీకరించారు.
ఈ సమయంలో జోక్యం చేసుకున్న ధర్మాసనం ‘ఆ నోటీసు ఇచ్చిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకున్నార’ని ప్రశ్నించింది.
ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఎలాంటి నోటీసు ఇవ్వాలో కూడా తెలియని పోలీసు అధికారులు కూడా ఉన్నారా? అని నిలదీసింది. దీనికి డిజిపి బదులిస్తూ శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.హైకోర్టు ఉత్తర్వులతో పనిలేకుండా 151 నోటీసు ఇచ్చిన ఎసిపిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
అంతేకాకుండా నోటీసును బలపర్చిన విశాఖ పోలీస్ కమిషనర్‌పై కూడా చర్యలు చేపట్టాలని నిర్దేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది.
కాగా, అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ ఉద్యమిస్తున్న మహిళలపై పోలీసుల తీరును కూడా హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. చీఫ్ జస్టిస్ నేతత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పోలీసుల తీరును ఎండగట్టింది. ఒక గ్రామంలో 500 మంది పోలీసులు మోహరించారంటే అక్కడేమైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయా అని నిలదీసింది.
పోలీసులు కవాతులు నిర్వహించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. దీనిపై కూడా డిజిపిని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. గ్రామాల్లో తిరగొద్దంటూ పోలీసులు చేసిన హెచ్చరికల తీరును తీవ్రంగా ఆక్షేపించింది. కవతాల చేస్తున్నారంటే మనం ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని నిప్పులు చెరిగింది.
పోలీసులు పక్షపాతంగా ఉండకూడదని, ప్రజల పక్షాన ఉండాలని తేల్చి చెప్పింది. చట్ట ప్రకారం విదులు నిర్వహించాలని స్పష్టం చేసింది. దీనిపై డిజిపి స్పందిస్తూ ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ప్లాగ్‌మార్చ్ నిర్వహించారని చెప్పారు. శాంతిభద్రతలను అదుపు చేసే క్రమంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు.