AP CM Jagan: ప్రభుత్వ పాలన మెరుగుపరుచుకోవడంతో పాటు పార్టీ బలోపేతంపై ఏపీ సీఎం జగన్ ఫోకస్ పెంచారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా గట్టి సవాల్ విసరాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు. టార్గెట్ 175 అంటూ.. అన్ని నియోజకవర్గాల్లో గెలుపుబాట పట్టాలని భావిస్తున్నారు. అందుకే ఇటీవల దూకుడు పెంచారు. అటు క్షేత్రస్థాయిలో సర్వేలు తయారుచేయించి నివేదికల రూపంలో తెచ్చుకుంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, పాలన గురించి ప్రజలకు తెలియజెప్పేందుకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకుగాను ఎమ్మెల్యేలకు వర్కుషాపు సైతం నిర్వహించారు. అటు పార్టీ బాధ్యులు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో సమావేశాలవుతూ వస్తున్నారు.

అదే కారణంతో…
అయితే గడగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వడం లేదు. అందుకే జగన్ పునరాలోచనలో పడ్డారు. ఒక్క ఎమ్మెల్యేలతో మాట్లాడితే సరిపోదని..క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకోవాలంటే ద్వితీయ శ్రేణి నాయకులతో భేటీ అయితేనే సాధ్యమవుతుందని భావించారు. అందుకే దిగువస్థాయి కార్యకర్తలతో నేరుగా మాట్లాడి పరిస్థితిని తెలుసుకోనున్నారు. వారి అభిప్రయాలను క్రోడీకరించి తప్పిదాలు ఉన్నచోట దిద్దుబాటు చర్యలు చేపట్టనున్నారు. గురువారం నుంచి కార్యకర్తల అభిప్రాయ సేకరణ తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీసులో ప్రారంభం కానుంది. తొలి నియోజకవర్గంగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంను ఎంచుకున్నారు.ఇప్పటికే కుప్పం నియోజకవర్గానికి చెందిన 50 మంది క్రియాశీలక నాయకులు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.
Also Read: Nancy Pelosi Taiwan Visit: చిచ్చుపెట్టిన అమెరికా.. తైవాన్ పై చైనా యుద్ధం చేయబోతుందా?
ఆ నియోజకవర్గాలపై ఫోకస్..
వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లోనూ గెలుపొందాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ప్రధానంగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతనిధ్యం వహిస్తున్న టెక్కలి, విశాఖ తూర్పు, ఉత్తర నియోజకవర్గాలు, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్, పాలకొల్లు, విజయవాడ వెస్ట్ వంటి ఎంపిక చేసిన నియోజకవర్గాలపై జగన్ ఫోకస్ పెంచారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గాలు టీడీపీ చేతిలో ఉన్నాయి. నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ నాయకులు జగన్ కు తెగ ఇబ్బంది పెడుతున్నారుట. అందుకే ఎట్టి పరిస్థితుల్లో వారు వచ్చే ఎన్నికల్లో గెలవకూడదని కృతనిశ్చయంతో ఉన్నారు. అందుకే ఆయా నియోజకవర్గ శ్రేణులతో ముందుగా సమావేశం కావాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ముందుగా కుప్పంతో మొదలు పెడుతున్నారు.

కుప్పంతోనే మొదలు..
కుప్పంలో చంద్రబాబును ఎలాగైనా ఓడించాలన్న కసితో జగన్ ఉన్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో దారుణంగా దెబ్బకొట్టారు. అసెంబ్లీ ఎన్నికల వరకూ ఇదే ఊపును కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. తాను సీఎంగానే శాసనసభకు వస్తానని చంద్రబాబు శపధం చేసిన సంగతి తెలిసిందే. అందుకే ఎమ్మెల్యేగా ఓడించి చంద్రబాబు పొలిటికల్ చాప్టర్ ముగించాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అక్కడి బాధ్యతలు అప్పగించారు. తాజా సమావేశంలో వైసీపీ శ్రేణుల అభిప్రాయాలను తీసుకోనున్నారు. అక్కడ ఎలా ముందుకెళ్తే గెలిచే చాన్స్ ఉందో కనుగోనున్నారు. స్థానిక సంస్థల ఫార్ములాను ఉపయోగించి చంద్రబాబును గట్టి దెబ్బ కొట్టాలన్న ప్రయత్నంలో అయితే జగన్ ఉన్నట్టు కనిపస్తోంది.