
విద్యుత్ చట్టానికి సవరణలు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతున్న సమయంలో పొరుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం కనీస స్పందన కూడా లేదు. 2003 విద్యుత్ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సవరణ బిల్లు 2020 తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది. అయితే ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రాల పరిధిలో ఉన్న విద్యుత్ రంగం.. కొత్త బిల్లుకు ఉభయ సభల ఆమోదం లభిస్తే కేంద్రం చేతుల్లోకి వెళ్తుంది. అలాగే ప్రవేటు సంస్థల నుంచి విద్యుత్ కొనుగోళ్లు, ఇతర అంశాలను కేంద్రమే పర్యవేక్షిస్తుంది. పరిస్థితులను బట్టి రైతులకు, పరిశ్రమలకు, ఇతర సేవా సంస్థలకు చార్జీల విషయంలో రాయితీలు ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉండదు.
కేంద్రం విద్యుత్ విషయలో జాతీయ స్థాయిలో ఈ నిర్ణయం తీసుకోవడానికి ఏపీలోని వైసీపీ ప్రభుత్వం పీపీఏల విషయంలో దూకుడుగా వ్యవహరించడమే కారణమనే వాదనలు ఉన్నాయి. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్ళలో గత టీడీపీ ప్రభుత్వం యూనిట్ కు రూ.6 వరకూ చెల్లించేలా ఒప్పందాలు చేసుకుంది. అనంతరం యూనిట్ విలువ రూ.2.48 వరకూ పడిపోయింది. టీడీపీ అధికారంలో ఉండగా ఒప్పందం ప్రకారం ప్రవేటు విద్యుత్ తయారీ సంస్థలకు పాత రేటు చెల్లించారు. అధికారం చేపట్టాక జగన్ విద్యుత్ ఒప్పందాలపై సమీక్ష నిర్వహించి చెల్లించే రేట్లు తగ్గించారు. ఈ వ్యవహారంపై ఆ సంస్థ కోర్టులను ఆశ్రయించాయి. కేంద్రం జోక్యం చేసుకుని పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ (పి.పి.ఏ) రద్దు చేయవద్దని, ఇది ఇబ్బందికరంగా మారుతుందని సూచించింది. అయినా జగన్ దూకుడు కొనసాగించారు. ఇటువంటి సమస్యలు భవిష్యత్ లో తలెత్తకుండా ఉండాలనే కేంద్రం విద్యుత్ సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కేంద్రం తెస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై తెలంగాణ సీఎం కేసీఆర్ మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. బీజేపీయేతర పార్టీల పాలన ఉన్న రాష్ట్రాలన్నీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఈ వ్యవహారంపై స్పందించలేదు. ముసాయిదాపై జూన్ 5 వ తేదీలోగా అభిప్రాయాలు తెలియజేయాలని కేంద్రం కోరింది. ఇప్పటి వరకూ కేంద్రానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోని జగన్ ఈ విషయంలో కూడా అదే వైఖరిని ప్రదర్శిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జగన్ వైఖరి కూడా అదే విధంగా కనిపిస్తోంది. రాష్ట్రాల ప్రయోజనాలకు విరుద్దంగా ఉన్న ఈ చట్టానికి జగన్ సుముఖత తెలిపితే మరోసారి ప్రతిపక్షాలు, ఇతర రాష్ట్రాల నించి విమర్శలకు గురవక తప్పదు.