దేశానికైనా, రాష్ట్రానికైనా రాజధాని గుండె వంటిది. ప్రభుత్వ వ్యవస్థ మొత్తం కొలువుదీరే నగరం.. అభివృద్ధికి స్వర్గధామం. రాజధానిని కేంద్రంగా చేసుకొనే.. ఎన్నో పరిశ్రమలు వెలుస్తుంటాయి. పెట్టుబడులు వస్తుంటాయి. తద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు విస్తృతం అవుతాయి. కానీ.. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఏపీ రాజధానిగా ప్రకటించిన అమరావతి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతో అమరావతి ఒక్కసారిగా కుప్పకూలిన పరిస్థితి! పూర్తికావొచ్చిన నిర్మాణాలన్నీ అర్ధంతరంగా ఆగిపోయాయి. అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఇప్పుడు అమరావతి భవిష్యత్ ఏంటన్నది ఎవ్వరికీ అర్థంకాని పరిస్థితి.
రాష్ట్రానికి ప్రకటించిన మూడు రాజధానులు ఎప్పటికి మనుగడలోకి వస్తాయో తెలియదు. కానీ.. ఎన్నో ఆకాంక్షలతో మొదలు పెట్టిన అమరావతి నిర్మాణం మాత్రం మధ్యలోనే నిలిచిపోయింది. చెదిరిపోయిన కలకు మొండి గోడలు మౌనసాక్షిగా దర్శనమిస్తున్నాయి. అమరావతిలో పెద్ద పెద్ద భవనాల నిర్మాణం కోసం తవ్విన పునాదుల్లో నీటితో నిండిపోయి సాగునీటి కాల్వలను తలపిస్తున్నాయి. ఇక, పూర్తయిన పలు భవనాలతోపాటు అసంపూర్తిగా మిగిలిన భవానాల్లోనూ పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి.
ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వచ్చిన వాళ్లంతా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. సొంత రాష్ట్రం అనే భావనతో చాలా మంది అమరావతికి రావడానికి ఆసక్తి చూపించారు. కానీ.. రాజధాని తరలించడానికి సర్కారు నిర్ణయించడంతో వాళ్లంతా మళ్లీ ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. చాలా మంది హైదరాబాద్ కు చేరుకోగా.. మరికొందరు చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాలకు చేరుకున్నారు. అమరావతిలో పనులన్నీ ఆగిపోవడంతో.. కార్మికులు సైతం పొట్ట చేతపట్టుకొని మరో చోటుకు వెళ్లిపోయారు. ఇప్పుడు అమరావతిలో కాపలా కాస్తున్న సెక్యూరిటీ గార్డులు తప్ప, మిగిలిన వారు ఎవ్వరూ లేరు. వారికి తోడుగా కొన్ని గేదెలు, ఇతరత్రా పశువులు మాత్రమే ఉంటున్నాయక్కడ.
దాదాపు రూ.254 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన ఫోరెన్సిక్ ప్రయోగశాల ఎందుకూ గొరకాకుండా మిగిలిపోయింది. దీంతో.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. దాదాపు 10 మీటర్లలోతున తవ్వి, నాలుగు మీటర్ల మందంతో వేసిన సచివాలయ పునాదులు నీటిలో మిగిలిపోయాయి. ఈ పునాలకు అయిన ఖర్చు ఏకంగా రూ.300 కోట్లు! పనులన్నీ నిలిచిపోవడంతో ఇవి చెరువుల్లా కనిపిస్తున్నాయి.
దీంతోపాటు రాజధాని ప్రధాన రహదారికి రూ.400 కోట్లు వెచ్చించారు. ఎనిమిది లేన్ల రహదారి ఎందుకూ పనికిరాకుండా మిగిలిపోయింది. ఈ రోడ్ల మీద పశులను పడుకోబెడుతున్నారు స్థానికులు. విద్యుత్, కమ్యూనికేషన్స్ వంటి కేబుళ్లను వేసేందుకు తీసిన గుంతలు నీటితో నిండిపోయి పశువులు, పందులు బొర్లడానికి పనికొచ్చే మడుగులా మారిపోయాయి. కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టిన దాదాపు 180 భవనాల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది.
దాదాపు 300 ఎకరాల్లో తలపెట్టిన శిల్పారామం కూడా పిచ్చి మొక్కల్లో కిలిసిపోయింది. ఇందుకోసం తెప్పించిన బొమ్మలు మొత్తం ఎందుకూ పనికిరాకుండా చెత్తలో కలిసిపోయాయి. మొత్తానికి ఎన్నో ఆశలతో చేపట్టిన అమరావతి మాత్రం అర్ధంతరంగా నిలిచిపోవడంతో చాలా నష్టం వాటిల్లింది. రాజధానికి భూములు ఇవ్వడం ద్వారా తమకు మేలు జరుగుతుందని భావించిన రైతుల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. రాజధానిని ఇక్కడే కొనసాగించాలని రైతులు, మహిళలు చేస్తున్న పోరాటం నేటితో 600 రోజులకు చేరింది. మరి, ఈ పోరాటానికి ఫలితం ఎప్పుడు? అన్నదే సమాధానం దొరకని ప్రశ్న.