AP Cabinet Reshuffle: కొత్త మంత్రుల తుది జాబితా సిద్ధమైంది. సుదీర్ఘ కసరత్తు తరువాత సీఎం జగన్ ఖరారు చేశారు. ముందు అనుకున్నట్టే పాత..కొత్త కలయికగా నూతన మంత్రివర్గం ఉంటుంది. ఒకరిద్దరు పాత మంత్రులను మాత్రమే కొనసాగిస్తామన్న మాట తప్పారు. సీనియర్ల ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు. ఇలా ఫైనల్ చేసిన జాబితాలో పేర్లు ఉన్న వారికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్తున్నాయి. దీంతో మంత్రులుగా ఎంపిక చేసిన వారి ఇంట వద్ద అనుచరులు, నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రధానంగా వర్గ విభేదాలు అధికమున్నచోట, గత మూడేళ్లుగా వివక్షకు గురైన వారు మంత్రులుగా ఎంపికైన నియోజకవర్గాల్లో సందడి వాతావరణం నెలకొంది. ప్రస్టేషన్ తో నేతలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

ప్రత్యర్థి పై పైచేయి సాధించామని అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. శ్రీకాకుళంలో ధర్మాన అనుచరులు, నెల్లూరులో కాకాని వర్గీయులు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. కొత్త కేబినెట్ జాబితా వెలువడక ముందే తమ నేత మంత్రి అయినట్టు, పలాన శాఖ నిర్వర్తించనున్నట్టు ఏకంగా భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటుచేసి సందడి చేయడం కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే మంత్రి పదవి దక్కిందని ప్రాథమికంగా సమాచారమందుకున్న నేతలు భారీ కాన్వాయ్ తో రాజధానికి పయనమయ్యారు. శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు మధ్యాహ్నమే అనుచరవర్గంతో బయలుదేరి వెళ్లారు.
Also Read: Women’s Empowerment: నిర్ణయాత్మక స్థానాల్లో మహిళలే మొగ్గు

మంత్రుల జాబితాను రాజ్ భవన్ కు పంపించారు . ప్రాథమిక సమాచారం మేరకు విజయనగరం జిల్లా నుంచి తాజా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్నదొర, శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజువిశాఖ జిల్లా నుంచి భాగ్యలక్ష్మి, గుడివాడ అమర్నాథ్, తూర్పు గోదావరి జిల్లా నుంచి దాడిశెట్టి రాజా, చిట్టి బాబు, వేణుగోపాల కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కారుమూరి నాగేశ్వరరావు, గ్రంధి శ్రీనివాస్, క్రిష్టా జిల్లా నుంచి జోగి రమేష్, కొడాలి నాని, రక్షణనిధి, గుంటూరు జిల్లా నుంచి విడదల రజనీ, మేరుగ నాగార్జున, ప్రకాశం జిల్లా నుంచి ఆదిమూలపు సురేష్, నెల్లూరు జిల్లా నుంచి కాకాణి గోవర్దన్ రెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కడప జిల్లా నుంచి అంజాద్ బాషా, కొరుముట్ల శ్రీనివాస్, కర్నూలు జిల్లా నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి, గుమ్మనూరు జయరాం, అనంతపురం జిల్లా నుంచి జొన్నలగడ్డ పద్మావతి, శంకర్ నారాయణలు దాదాపు ఖరారు చేశారు. వీరు పేర్లు ఖరారు చేస్తూ గవర్నర్ ఆమోదానికి జాబితాను పంపించారు. వీరంతా సోమవారం ఉదయం 11.31 గంటలకు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లలో యంత్రాంగం తలమునకలై ఉంది.
Also Read:Current cuts: కరెంట్ కోతలైనా.. మరేదైనా.. వైసీపీది ఒకటే దారి..!