AP Cabinet : ఏపీ కేబినెట్.. పాత వాటికే కొత్త నిర్ణయాలు

వాస్తవానికి కేబినెట్ భేటీ అంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆతృత ప్రజల్లో ఉండేది. మా జిల్లాకు ఏం వరాలు ప్రకటించారోనని ఆరాతీసేవారు. మీడియా సైతం కథనాలు, వార్తల కోసం వేచి ఉండేవి. కానీ గత నాలుగేళ్లుగా కేబినెట్ మీటింగులు చూసి ప్రజలు, మీడియా పెద్దగా అంచనాలు పెట్టుకోవడం మానేశాయి.

Written By: NARESH, Updated On : July 12, 2023 10:39 pm
Follow us on

AP Cabinet : ఏపీ కేబినెట్ అంటే హడావుడే తప్ప.. పాత నిర్ణయాలే అన్న అపవాదు ఉంది. వివాదాస్పద భూముల కేటాయింపు వంటి వాటి విషయంలో గోప్యత పాటించి.. బటన్ నొక్కుడు నిధుల కేటాయింపునకే ప్రాధాన్యత ఇస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కేబినెట్ అంటే మంత్రులంతా కలుస్తారు. జగన్ కు భజనతో కొలుస్తారు. అంతకు మించి ఏమీ ఉండదన్న విమర్శలను నిజం చేసేలా వారి వ్యవహార శైలి ఉంటుంది. తాజాగా జరిగిన కేబినెట్ మీటింగ్ లో సైతం పాత దృశ్యాలే వెలుగుచూశాయి. పేరుకే 70 రకాల అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేస్తారని చెప్పినా.. అందులో చాలావాటివి పాతవే.

గతంలో కూడా కేబినెట్ భేటీలో వన్ టైమ్ షెటిల్మెంట్ పథకం గురించి ఆర్భాటంగా ప్రకటించారు. ప్రభుత్వ సాయంతో కట్టిన ఇంటికి లక్షల రూపాయల ఆస్తిగా మార్చుతామని చెప్పారు. ఎప్పుడో ఎన్టీఆర్ హయాం నుంచి కట్టిన కాలనీలకు కొలతలు తీసి డబ్బు కట్టించుకున్నారు. ఒక ధ్రువపత్రం అందిస్తామని.. దాని ద్వారా బ్యాంకుల నుంచి రుణం పొందవచ్చని నమ్మబలికారు. కానీ కట్టిన వారు నెలల తరబడి సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారే తప్ప ఆ పత్రాలు చేతికందిన దాఖలాలు లేవు. ఎంతో ఊహించుకొని డబ్బులు కట్టిన వారికి చుక్కలు కనిపిస్తున్నాయి.

వాస్తవానికి కేబినెట్ భేటీ అంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆతృత ప్రజల్లో ఉండేది. మా జిల్లాకు ఏం వరాలు ప్రకటించారోనని ఆరాతీసేవారు. మీడియా సైతం కథనాలు, వార్తల కోసం వేచి ఉండేవి. కానీ గత నాలుగేళ్లుగా కేబినెట్ మీటింగులు చూసి ప్రజలు, మీడియా పెద్దగా అంచనాలు పెట్టుకోవడం మానేశాయి. కేబినెట్ మీటింగ్ అంటే బటన్ నొక్కుడు పథకాలకు నిధుల కేటాయింపు హడావుడే తప్ప శాశ్వత ప్రాజెక్టులేవీ అజెండాలో ఉండవు. అటువంటప్పుడు కేబినెట్ పెడితే ఏంటి? పెట్టకుంటే ఏంటి? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

రాజకీయంగా కూడా ఎటువంటి నిర్ణయాలు ప్రకటించలేదు. ముందస్తుపై ఎటువంటి ఆలోచన పెట్టుకోకండి అని సహచర మంత్రులకు సీఎం జగన్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అక్కడకు కొద్దిసేపటికే ఎన్నికలకు సిద్ధంగా ఉండండి అని ఆదేశాలివ్వడంతో క్లారిటీలో సైతం స్పష్టత లోపించింది. అయితే ప్రజలకు ఎటువంటి అంచనాలు లేవు కాబట్టి సరిపోయింది. లేకుంటే కేబినెట్ నిర్ణయాలు బయటకు వచ్చిన తరువాత తల బొప్పి కట్టడం ఖాయం. కానీ వైసీపీ నేతల హడావుడి మాత్రం అంతాఇంతా కాదు. ఏకంగా ఏపీ రూపురేఖలు మార్చేసే నిర్ణయాలు తీసుకున్నట్టు వారు ప్రచారం చేసుకుంటున్నారు.