ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణ చేపడితే సీనియర్ల నుంచి చిక్కులు తప్పేలా లేవని తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది తమ భవిష్యత్ ఏమిటనే దానిపై మల్లగుళ్లాలు పడుతున్నారని సమాచారం. పార్టీని నమ్ముకుని ఉన్నందుకు మంత్రి పదవుల నుంచి తప్పిస్తే ఎలా అని ఆలోచనలో పడిపోతున్నట్లు చెబుతున్నారు. సీనియర్ల నుంచి ఎదురయ్యే ముప్పు తోనే ఇన్నాళ్లు మంత్రివర్గ విస్తరణపై ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారని పార్టీ నేతలే వెల్లడిస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న సీనియర్లలో కొందరి ప్రవర్తన భిన్నంగా ఉంటోంది. వీరిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ల తీరు పలు వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది. ఇప్పటికే వీరిపై పలు రకాల పుకార్లు వినిపిస్తున్నాయి. పార్టీ మారతారనే వార్తలు సైతం చక్కర్లు కొడుతున్నాయి. బొత్స మాత్రం బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ చేపడితే వీరు ఏ మేరకు స్పందిస్తారోననే అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి.
ఈనేపథ్యంలో వారిని రాష్ర్టంలో ఉంచకుండా ఢిల్లీకి పంపాలనే ఆలోచనలో అధినేత జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. వారికి రాజ్యసభ పదవులు ఇచ్చి వారిని అక్కడకే పరిమితం చేయాలని చూస్తున్నారు. జిల్లాల్లో వారి పట్టులేకుండా చేయాలనే నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ పదవులు ఇచ్చినా వారు ఇలాగే చేస్తారనే ఆలోచనతోనే వారిని ఢిల్లీకి పంపించాలని చూస్తున్నట్లు చెబుతున్నారు.
ఇప్పటికే పెద్దిరెడ్డి, బొత్స తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. జగన్ తమను పక్కన పెడతారనే ఆలోచనతోనే ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా వారు మాత్రం వైసీపీకి పంగనామాలు పెట్టడం ఖాయమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీలో సీనియర్ మంత్రుల తీరు ఎలా ఉంటుందోననే సందేహాలు అందరిలో వస్తున్నాయి.