Homeఆంధ్రప్రదేశ్‌జ‌గ‌న్ గ‌ట్టెక్కడానికి.. బీజేపీ స‌ల‌హా!

జ‌గ‌న్ గ‌ట్టెక్కడానికి.. బీజేపీ స‌ల‌హా!

AP Suffering With Debts

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక ప‌రిస్థితి ఏంట‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. అప్పుల‌తోనే బండి నెట్టుకుపోవాల్సిన ప‌రిస్థితి. దీంతో.. అవ‌కాశం ఉన్న ప్ర‌తిచోటా అప్పులు చేస్తోంది రాష్ట్రం. అయితే.. ఈ అప్పుల విష‌యంలో నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తుంటే.. విప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ఇందులో ప్ర‌ధాన‌మైన‌ది స్టేట్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ పేరుతో తెచ్చే అప్పులు. ఈ కార్పొరేష‌న్ పేరుతో ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు రూ.25 వేల కోట్లు అప్పు చేసిన‌ట్టు అంచ‌నా.

అయితే.. ఈ అప్పు విష‌యం అటు కేంద్రానికిగానీ, ఇటు రాష్ట్ర శాస‌న స‌భ‌కుగానీ చెప్ప‌లేద‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతూనే ఉన్నాయి. ఇలా.. మితిమీరిన అప్పులు చేస్తున్నార‌నే ఈ మ‌ధ్య కేంద్ర ప్ర‌భుత్వం రుణ ప‌రిమితిని భారీగా త‌గ్గించిన సంగ‌తి తెలిసిందే. ఇలా అప్పు చేయ‌డం విష‌యంలోనే ఒక వివాదం న‌డుస్తుంటే.. ఈ కార్పొరేష‌న్ ద్వారా చేసిన అప్పులు తీర్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంచుకున్న మార్గం కూడా వివాదాస్ప‌దం అవుతోంది.

ఈ అప్పుల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ద్యం ద్వారా వ‌చ్చే ఆదాయాన్ని మ‌ళ్లిస్తోంది. అది కూడా ప్ర‌భుత్వ ఖ‌జానాకు చేరిన త‌ర్వాత కాదు. స‌ర్కారు ఖ‌జానాకు చేర‌కుండానే.. మ‌ద్యం డిపోల నుంచే ఎస్‌డీసీకి న‌గ‌దు మ‌ళ్లించేలా, అక్క‌డి నుంచి బ్యాంకుల‌కు చెల్లించేలా నిబంధ‌న‌లు రూపొందించింది ప్ర‌భుత్వం. ఇది స‌రైన విధానం కాద‌ని, ఇది రాజ్యాంగ విరుద్ధం అని విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి.

దీన్ని తెర‌పైకి తెస్తే.. ప్ర‌భుత్వంతోపాటు అధికారులు కూడా బోనులో నిల‌బ‌డాల్సి వ‌స్తుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలోనే బీజేపీ నేత జీవీఎల్ న‌ర‌సింహారావు ఈ అంశంపై మాట్లాడారు. విమ‌ర్శ‌లు గుప్పించ‌డంతోపాటు ఏపీ స‌ర్కారుకు ప‌రోక్షంగా ప‌లు సూచ‌న‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. త‌క్ష‌ణ‌మే స్టేట్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం స‌వ‌ర‌ణ‌లు చేయాల‌ని అన్నారు.

ఇలా చెప్ప‌డం ద్వారా.. ప్ర‌భుత్వం త‌ప్పుల నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలో సూచ‌న‌లు చేసిన‌ట్టుగా ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. స‌ల‌హాలు, సూచ‌న‌లు చేసిన త‌ర్వాత ఈ విష‌య‌మై కేంద్ర ఆర్థిక మంత్రికి ఫిర్యాదు చేస్తామ‌ని కూడా చెప్పుకొచ్చారు. ఇది విన్న వారంతా.. ఈ ప‌నేదో చేయ‌కుండా.. ఈ స‌ల‌హాలు ఇవ్వ‌డ‌మేంటీ? అనే క్వ‌శ్చ‌న్ మార్క్ ఫేస్ పెడుతున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version