BJP vs YCP: ఏపీ మంత్రి కొడాలి నాని ‘క్యాసినో’ వ్యవహారం ఇప్పట్లో ముగిసిపోయేలా లేదు. ఆయన టార్గెట్ గా ఇప్పటికే టీడీపీ చేస్తున్న రచ్చకు బీజేపీ తోడైంది. టీడీపీ ఆందోళన పతాకస్థాయికి చేరింది. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేసే బాధ్యతను ఏపీ బీజేపీ మీద వేసుకుంది. గుడివాడలో క్యాసినో వివాదాన్ని మరింతగా బీజేపీ రాజేసింది. టీడీపీ చేస్తున్న యుద్ధంలోకి బీజేపీ ఎంట్రీ ఇచ్చి రచ్చ చేసింది.
ఏపీ మంత్రి కొడాలి నాని కళ్యాణ మండపంలో ‘క్యాసినో వివాదం’ఫై ఏపీ బీజేపీ నేతలు మంగళవారం ‘చలో గుడివాడ’ కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ నుంచి గుడివాడ వెళుతున్న బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తలపెట్టిన చలో గుడివాడను అడ్డుకున్న పోలీసులు సీఎం రమేష్, విష్ణువర్ధన్ రెడ్డి, సోము వీర్రాజు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. సోము వీర్రాజు పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.
మమ్ములను ఎందుకు అడ్డుకుంటున్నారు, గుడివాడలో 144 సెక్షన్ ఉందా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఎంపీ సీఎం రమేష్ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే బీజేపీ శ్రేణులు సీఎం డౌన్ డౌన్ నినాదాలు చేశారు. దీంతో గుడివాడ పరిసరాలు దద్దరిల్లాయి.
దీంతో చలో గుడివాడ ఉద్రిక్తంగా మారింది. రోడ్డుపై బైఠాయించి సోము వీర్రాజు నిరసన తెలిపారు. సోము వీర్రాజు సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు కొడాలి నానిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కలువపాముల వద్ద బీజేపీ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. .
బీజేపీ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. తాము నిరసనలకు వెళ్లడం లేదని.. గుడివాడలో సంక్రాంతి వేడుకలకే వెళుతున్నామని బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. సంక్రాంతి వేడుకలకు వెళుతుంటే అడ్డుకుంటున్న పోలీసులు గుడివాడలో పేకాట, క్యాసినో, చీర్ గాల్స్ కు ఎలా అనుమతిలిచ్చారని సోము వీర్రాజు ప్రశ్నించారు.
ఇలా టీడీపీ అంటించిన ‘క్యాసినో’ వివాదాన్ని బీజేపీ మరింత ముందుకు తీసుకెళ్లింది.చూస్తుంటే ఈ వివాదం కొడాలి నాని మంత్రి పదవికే ఎసరు తెస్తుందా? అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.