AP Assembly Session 2022: ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గతంలో కరోనా నేపథ్యంలో సభ నిర్వహణ సాధ్యం కాలేదు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపేందుకు సమాయత్తం అవుతున్నాయి.

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం ఎన్నో చిక్కులు తెచ్చిన సందర్భంలో సభలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు తయారవుతున్నాయి. సభలో 20 బిల్లులపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వం చేస్తున్న పనులతో కలిగే ఇబ్బందులను సభ దృష్టికి తీసుకురావాలని చూస్తున్నాయి.
రాష్ట్రంలో రోజురోజుకు సమస్యల చిట్టా పెరిగిపోతోంది. ఎటు చూసినా రోడ్లు అధ్వానంగా కనిపిస్తున్నాయి. రోడ్ల దుస్థితిపై ఇదివరకే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని నిలదీసిన విషయం తెలిసిందే. కానీ వాటి మరమ్మతుకు మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఫలితంగా రహదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
సభలో ఇటీవల మరణించిన మంత్రి గౌతంరెడ్డికి సంతాపం తెలిపే తీర్మానం, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపడం, మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా వారి ప్రసంగాలను చూపించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టనుంది.

దీంతో సభ నిర్వహణపై ప్రభుత్వం ముందస్తు వ్యూహాలతో ముందుకెళ్తోంది. ప్రతిపక్షాలను సమర్థంగా ఎదుర్కోవాలని భావిస్తోంది. అందుకోసం అన్ని అస్త్రాలు తయారు చేసుకుంటోంది. సీఎం జగన్ ను నిలదీసేందుకు ప్రతిపక్షాలు రెడీ అవుతున్నాయి. ప్రభుత్వ ఒంటెత్తు పోకడలకు చెక్ పెట్టాలని టీడీపీ భావిస్తోంది. చంద్రబాబు సభకు రాకపోవడంతో ఎమ్మెల్యేలే ప్రభుత్వంపై పోరాటం చేయనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో నిజానిజాలు బయటపెట్టాలని ప్రతిపక్షాలు కోరనున్నాయి. అమరావతి రాజధాని విషయంలో కూడా ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలపై కూడా స్పష్టత రావాలని చూస్తున్నాయి. దీంతో ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాల గురించి ప్రధానంగా చర్చ జరగనుందని సమాచారం.
[…] Andhra Pradesh Assembly budget session: ఏపీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో ఓ కీలక ఘటన చోటుచేసుకుంది. గవర్నర్ ప్రసంగం చాలా హుందాగా కనిపించింది. అంతేగానీ ఎక్కడా కూడా వివాదాస్పద అంశాల జోలికిపోకుండా.. కేవలం చెప్పాలనుకున్నది స్పష్టంగా వివాద రహితంగా చెప్పేసినట్టు తెలుస్తోంది. అయితే మొన్న కోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీలో మూడు రాజధానుల అంశాలపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆయన ఆ పని చేయలేదు. […]