Bigg Boss Non Stop Telugu: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ షో మొదలై వారమైంది. ఈ వారంలో ఎమోషనల్ రివెంజ్ డ్రామాలు చాలానే జరిగాయి. అలాగే కొన్ని సరదా సంఘటనలు కూడా బాగా అలరించాయి. ఇక ఈ మొదటి వారాంతాన్ని సందడిగా ముగించేందుకు నాగార్జున వచ్చాడు. సండే ఫండే అంటూ కంటెస్టెంట్ల మధ్య వింత వింత టాస్కులు పెడుతూ ప్రేక్షకులకు మరింత కిక్ ఇవ్వడానికి శతవిధాల ప్రయత్నాలు చేశాడు.

అలాగే, సీరియస్ డ్రామాలో కొందరికి నాగార్జున చురకలు కూడా అంటించాడు. పైగా మిత్రశర్మ, ఆర్జే చైతూలతో పాటు బిందు మాధవికి కూడా కొన్ని సలహాలు, మరికొన్ని సూచనలు ఇచ్చాడు. అయితే ఆర్జే చైతూ ఆడిన ఆట పై మాత్రం నాగ్ ఫుల్ సెటైర్లు వేశాడు. ‘జనాలు అన్నీ చూస్తుంటారు.. గెలవడం ముఖ్యం కాదు.. ఎలా గెలిచామన్నది కూడా చాలా ముఖ్యం అంటూ నాగ్ వేసిన సెటైర్లకు ఆర్జే చైతూ పేస్ మాడిపోయింది.
ముఖ్యంగా నాగార్జున ఆర్జే చైతూ మీద కౌంటర్లు వేస్తూ.. ‘పీచు మొత్తం పీకేయమంటే.. పిలక ఉంచాలని అన్నావ్.. ఎలా చేసినా కూడా రిజెక్ట్ చేద్దామని అనుకున్నావ్ కదా ?’ అంటూ నాగార్జున చెప్పడం ఆకట్టుకుంది. ఇక బాడీ షేమింగ్ మీద ఆర్జే చైతూ బాధపడ్డ విషయం పై కూడా నాగార్జున స్పందిస్తూ.. మన గురించి ఎప్పుడూ ఎవరో ఏదో అనుకుంటూనే ఉంటారు. వాటిని పట్టించుకోకూడదు.

అయినా అలా అన్ని పట్టించుకుని ఉండి ఉంటే.. నీలానే అన్ని అలా అనుకుని ఉండి ఉంటే.. అమితాబ్ బచ్చన్ అంతటి వాడు కాలేకపోయేవాడు’ అని నాగ్ ఆమెను ప్రోత్సహించే ప్రయత్నం చేశాడు. ఏది ఏమైనా చైతూ ఆడిన ఆటను అందరూ తప్పు పట్టేయడం, టెంకాయ పీచుని తీసేసే టాస్క్ లో ఆర్జే చైతూ నిర్ణయంతో వారియర్స్ టీం పాయింట్ ను కూడా పోగొట్టుకుంది. మొత్తానికి నాగార్జున వీకెండ్ లో జోష్ నింపే ప్రయత్నం చేశాడు.