
Ayyanna Patrudu: టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఫోర్జరీ కేసులో అయ్యన్నను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కానీ అయ్యన్న హైకోర్టు తలుపుతట్టి స్టే తెచ్చుకున్నారు. దీనిపై పట్టువదలని విక్రమార్కుడిలా వ్యవహరిస్తూ వచ్చిన ఏపీ సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో అత్యున్నత న్యాయస్థానం స్టేను కొట్టివేసింది. దీంతో ఫోర్జరీ కేసు విచారణలో మరింత దూకుడుగా ముందుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. అయ్యన్న చుట్టూ ఉచ్చుబిగిసేలా కేసు విచారణ చేపట్టే చాన్స్ ఉంది. గత ఎన్నికల తరువాత టీడీపీ తాజా మాజీ మంత్రులపై వైసీపీ సర్కారు ఫోకస్ పెట్టింది. రకరకాల కేసులతో, అరెస్ట్ లతో వెంటపడింది. అయ్యన్నపై ఫోర్జరీ నెపం పెట్టింది. కానీ ఆయన న్యాయస్థానానికి వెళ్లి స్టే తెచ్చుకోవడంతో వెనక్కి తగ్గింది. ఇప్పుడు దూకుడు పెంచే చాన్స్ ఉంది.
అయ్యన్నపాత్రుడు దూకుడు స్వభావం ఉన్న వ్యక్తి. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత చాలామంది మంత్రులు, టీడీపీ నాయకులు కేసుల భయంతో వెనక్కి తగ్గారు. సైలెంట్ అయ్యారు. అయితే దానికి విరుద్ధంగా అయ్యన్నపాత్రుడు వ్యవహరించారు. దూకుడు కనబరిచే వారు. నేరుగా సీఎం జగన్ పైనే విమర్శనాస్త్రాలు సంధించేవారు. ఆయన కుమారుడు చింతకాయల విజయ్ సైతం టీడీపీలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. సోషల్ మీడియా సారధ్య బాధ్యతలు వహిస్తున్నారు. హిందూపురం ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంలో విజయ్ పేరు బయటకు వచ్చింది. ఆయన్ను అరెస్ట్ చేసే ప్రయత్నాలు సైతం జరిగాయి. అటు అయ్యన్న ఇంటిని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ ప్రహరీని సైతం తొలగించారు. అయినా సరే అయ్యన్నపాత్రుడు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. వైసీపీ సర్కారుతో పాటు జగన్ చర్యలను తూలనాడుతూ వస్తున్నారు.

అయితే హైకోర్టులో స్టే లభించడంతో అయ్యన్న ఊరట చెందారు. కానీ వైసీపీ సర్కారు మాత్రం దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. హైకోర్టు స్టేను కొట్టివేయాలని అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్లు దాఖలు చేసింది. ఎట్టి పరిస్తితుల్లో స్టే రద్దుచేసి విచారణ పక్కాగా నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. ఇప్పుడు స్టే రద్దు కావడంతో శరవేగంగా పావులు కదిపే అవకాశముంది. అయితే దాదాపు వైసీపీ నేతలందరి టార్గెట్ అయ్యన్నపాత్రుడే. వైసీపీ నేతలకు దగ్గరగా అయ్యన్న భాష ఉంటుంది. సహజంగా ఇది వారికి మింగుడుపడని అంశం. అందుకే ఎలాగైనా అయ్యన్నను కటకటాలపాలు చేయాలన్నది యావత్ వైసీపీ టీమ్ కోరిక. దాని కోసం సుప్రీం కోర్టు వరకూ వెళ్లారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. జగన్ ప్రభుత్వ బాధితుల్లో మరో సీనియర్ చేరినట్టే. అయ్యన్న చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టే.