Recession: 2008 సెప్టెంబర్ 15న అమెరికా కేంద్రంగా కార్యకాలపాలు సాగించే దిగ్గజ లేమన్ బ్రదర్స్ కంపెనీ మూతపడింది. ఈ పరిణామం తర్వాతే ఒక భారతదేశం మినహా ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంతో విలవిలలాడింది. తర్వాత అన్ని దేశాలు కోలుకునేందుకు కొన్ని సంవత్సరాలు పట్టింది. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. పెద్ద పెద్ద కంపెనీలు బోర్డు తిప్పేసాయి. బ్యాంకులయితే మొత్తానికి మూతపడ్డాయి. లెమాన్ బ్రదర్స్ సంక్షోభం ప్రపంచానికి ఒక గుణపాఠం. ఈ సంక్షోభం జరిగిన 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ తరహా ఛాయలే కనిపిస్తున్నాయి. చైనా కేంద్రంగా రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు సాగించే ఎవర్ గ్రాండ్ కంపెనీ పతనం అంచున నిలిచింది. ఈ కంపెనీ కోసం వివిధ బ్యాంకులు 22 లక్షల కోట్ల దాకా రుణాలు ఇచ్చాయి. ఇప్పుడు ఆ బ్యాంకులు లబోదిబోమంటున్నాయి. చైనా ప్రభుత్వం కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే ఎవర్ గ్రాండ్ కంపెనీ కూడా మరో లెమాన్ బ్రదర్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ కూడా అదే బాటలో..
టెక్ దిగ్గజాలు గూగుల్, ఆపిల్, వంటి కంపెనీలు పొదుపు చర్యలకు దిగాయి పనితీరు సరిగా లేకపోతే ఇంటికెళ్లి పోవాల్సి వస్తుందని సెర్చ్ ఇంజన్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులకు అల్టిమేటం ఇచ్చారు. ఆపిల్ సంస్థ మరో అడుగు ముందుకేసి వందమంది కాంట్రాక్ట్ బేస్డ్ రిక్రూటర్లను తొలగించింది. ఈ కాంట్రాక్టు బేస్డ్ రిక్రూటర్ల ఆధ్వర్యంలో సంస్థలో కొత్త ఉద్యోగుల నియామకాలు జరిగేవి. ఉద్వాసనకు గురైన వారికి రెండు వారాల మెడికల్ బెనిఫిట్స్, వేతనాలు చెల్లించనున్నట్లు ఒక వార్త కథనాన్ని ప్రచురించింది. సంస్థ ఆర్థిక అవసరాల రీత్యా ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్టు ఆపిల్ ప్రకటించింది. ఖర్చులు కూడా ఆచితూచే పెడతామని గత నెలలో జరిగిన వార్షిక సమావేశంలో ఆపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్ ప్రకటించారు. సంస్థకు ఆదాయం వచ్చే విభాగంలో మాత్రమే నియామకాలు చేపడతామని, పెట్టుబడులు పెడదామని తెలిపారు.
పింక్ స్లిప్పులు ఇచ్చే యోచనలో
ప్రఖ్యాత సెర్చ్ ఇంజన్ గూగుల్, కంప్యూటర్ల దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా ఆపిల్ బాటనే అనుసరిస్తున్నాయి. పనితీరు బాగోలేకపోతే పింక్ స్లిప్పులు ఇచ్చేసి, బయటికి పంపిస్తామని సిలికాన్ వ్యాలీ లో పనిచేస్తున్న ఉద్యోగులకు అల్టిమేటం ఇచ్చేశాయి. ఇక దక్షిణాసియాలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఇదే తరహా లోనే చెప్పాయి. ప్రస్తుతం ఈ కంపెనీలు కూడా లాభదాయకంగా ఉన్న వ్యాపారాల్లో మాత్రమే పెట్టుబడులు పెడుతున్నాయి. కంపెనీలకు గుదిబండగా ఉన్న వ్యాపారాలను నిర్దాక్షిణ్యంగా తొలగించుకుంటున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ కు ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో ఉద్యోగులు ఉన్నారు. వీరికి ఇచ్చే వేతనాలు కూడా భారీగానే ఉన్నాయి. అయితే గత కొన్ని నెలల నుంచి ఈ కంపెనీలకు వచ్చే ప్రాజెక్టులు భారీగా తగ్గిపోయాయి. మరోవైపు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఫలితంగా యూరప్ మార్కెట్లో అనిచ్చితి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ప్రాంతంలో కరువు ఏర్పడడం కూడా మరో కారణం. అందువల్లే కంపెనీలకు వచ్చే ఆదాయాలు తగ్గిపోవడంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు చైనా, అమెరికా దేశాల్లో ఈ ఏడాది జిడిపి తగ్గుతుందని సంకేతాలు ఉండటంతో ఆయా దేశాల్లో మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఫలితంగా కంపెనీలకు సంబంధించిన షేర్ విలువ నికరంగా పడిపోతున్నది. మరోవైపు గత రెండేళ్లు కరోనా ప్రభావం వల్ల ప్రపంచం మొత్తం అట్టుడికింది. ఇది కూడా ఈ కంపెనీలు పొదుపు చర్యలకు దిగడానికి ఒక కారణమని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
చైనాలో ఎవర్ గ్రాండ్ కుప్పకూలినట్టే..
ఇప్పుడు అమెరికా కంపెనీలు కూడా కుదలేయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రాజెక్టులు రాకపోవడం… ఈ పొదుపు చర్యలు ఫలించకుంటే కంపెనీలు కూడా మాంద్యం ఊబిలో కూరుకుపోవడం ఖాయం.. భారతదేశం ఇప్పుడిప్పుడే పుంజుకుంటుండడంతో ఈ మాంద్యం జాడలు అయితే కనిపించడం లేదు. అయితే అమెరికా, ఇతర అగ్రదేశాలు మాంద్యంలో కూరుకుంటే ఆ ఎఫెక్ట్ భారత్ పై కూడా పడుతుంది. కానీ మన ఆర్థిక వ్యవస్థ గాడిలోనే ఉండడంతో ఈ మాంద్యాన్ని తట్టుకునే అవకాశాలున్నాయి. ఉక్రెయిన్, రష్యా యుద్ధం, యూరప్ ప్రాంతాల్లో కరువు కాటకాలు ఏర్పడటంతో మరో మాంద్యం ముప్పు తప్పదనే సూచనలు కనిపిస్తున్నాయి.